Monday, April 4, 2011

జాస్తి వేంకట నరసింహారావు

‘ఉభయభాషాప్రవీణ’ జాస్తి వేంకట నరసింహారావు
గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పెదపూడి వీరి స్వగ్రామం.
తండ్రి  : రామస్వామి
తల్లి    : నరసమ్మ
1909 జులై ఒకటిన జన్మించారు.
ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు.
మగబిడ్డలలో నాల్గవవారు  నరసింహారావు గారు.
వీరి తాత నరసయ్య పేరును మొదట వీరికి పెట్టారు.
విద్యాభ్యాస కాలంలో వీరు తనపేరును వేంకట నరసింహారావు గా మార్చుకొన్నారు.
1981 లో “పండితరావు” అనే కలంపేరుతో కొన్ని రచనలు చేశారు.
1983లో సంన్యాస గ్రహణ సమయమున “స్వామి శాంతానంద సరస్వతి” అనే దీక్షానామాన్ని గ్రహించారు.
బాల్యం : 1917,1918 సంవత్సరాలలో షేక్ జానా అహమద్ సాహెబ్ గారి వీధిబడిలో చదువుకొన్నట్లు తన ఆత్మకధలో ప్రస్థావించారు. అంతేగాక మరొకరిద్దరు బ్రాహ్మణోత్తముల వీధిబడులలో కూడా చదివినట్లు గుర్తు చేసుకున్నారు.
1923-24 ప్రాంతంలో ప్రక్క గ్రామమైన అమృతలూరులో సంస్కృతోన్నత పాఠశాలలో చేరి, 1929 మార్చి ఎంట్రెన్స్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
ఆరోజుల్లో నెలకు మూడు రూపాయల స్కాలర్ షిప్పు కూడ వీరికి లభించేది.
కాలేజి చదువు : 1931లో చిట్టిగూడూరుసంస్కృత కళాశాలలో చేరారు. 1935లో ‘ఉభయభాషాప్రవీణ’  పూర్తిచేశారు.
ఉద్యోగములు: 1936 నుండి వివిధ పాఠశాలలలో తెలుగు పండితుడిగా పనిచేశారు. 1939 లో కొల్లూరు హైస్కూలు లో పనిచేస్తున్నప్పుడే వివాహమైంది. ఉపాధ్యాయ పండిత పరిషత్ లో చురుకైన పాత్ర వహించారు. పెదనందిపాడు, చీరాల, కొల్లూరు, హైస్కూళ్ళలో పనిచేస్తున్నప్పుడు పొరుగూరు విద్యార్ధుల కోసం హాస్టళ్ళు నిర్వహించి వారికి సహకరించారు. సంపన్నులు, విద్యాధికులైన బ్రాహ్మణులెక్కువగా ఉన్న కొల్లూరు వంటి చోట్ల,  ‘కమ్మ తెలుగు’ అని అవహేళన నుండి ‘కమ్మని తెలుగు’ గా కీర్తింపబడ్డారు. 1949 సంవత్సరం కృష్ణానదికి వరదలు వచ్చినపుడు, ముంపుకు గురైన లంకగ్రామాల ప్రజలు కొల్లూరు చేరగా, గ్రామస్థుల సహాయ సహకారాలతో- దాదాపు వెయ్యి మందికి 12 రోజులపాటు భోజన సదుపాయాలు కలగజేశారు.
వ్యాపారము : తెలుగు పండితుడిగా పనిచేస్తూనే, తెనాలి ‘కవిరాజ’ పబ్లిషర్స్ వారికి సహకరించి, వారి గ్రంధప్రచురణ సంస్థకు మంచి లాభాలనార్జించిపెట్టారు.
1952 లో ‘మనోరమా పబ్లికేషన్స్’ ప్రారంభించి, ఉద్యోగానికి రాజీనామాచేసి, మకామును తెనాలికి మార్చారు. హైస్కూలు తరగతులకు పాఠ్యగ్రంధాలు ప్రచురించి, ఆదర్శవంతమైన పుస్తక ప్రచురణ సంస్థగా తీర్చిదిద్దారు.
సహధర్మచారిణి మరణం :  1957 ఆగస్టు 11 వ తేదీన స్త్రీశిశువును ప్రసవించిన భార్య దుర్గాంబ, అనారోగ్యానికి గురై, 1958మార్చి 25న పరమపదించారు. అప్పుడు పెద్ద కుమార్తెకు 18ఏండ్లు కాగా కడసారిపిల్లకు ఏడుమాసాలు. వీరి మధ్య ఆయావయసుల్లో నలుగురు మగపిల్లలు. అప్పటికి ఆయన వయస్సు 49 సంవత్సరాలు, బంధుమిత్రులు, పెద్దల సలహాలను తిరస్కరించి, ద్వితీయ వివాహము చేసికోకుండా, పిల్లలను తీర్చిదిద్దుకున్నారు.
1956 నుండి 1966 వరకు పెదపూడి పాఠశాలను నిర్వహించారు.
వీరు ఒక సంప్రదాయమునకు, సమాజమునకు కట్టుబడకుండా ఆత్మ జిజ్ణాసువుగా కృషి చేసి, వేదాంతజీవితం గడిపారు. ఆకృషిలో భాగంగా కొన్ని ఆలోచింపజేసే రచనలు కావించారు.
ప్రతి వ్యక్తి తన జయాపజయాల ద్వారా, తన జీవితానుభూతులద్వారా మాత్రమే దైవ సాన్నిధ్యం పొందవలసి యుండునని ఆయన నమ్మిన సిద్ధాంతం.
సంసారంలో నరుడుగా ఆవిర్భవించిన జీవుడు నారాయణుడుగా రూపొందుటయే జీవిత పరమార్ధమని, అదే సృష్టిరహస్యమని వీరి నమ్మిక.


  వీరి రచనలు కొన్ని.....
1.  శ్రాద్ధ నిర్ణయము
2.  జీవాత్మ
3.  వైదిక సంధ్యా రహస్యము
4. శ్రీ దయానంద హృదయము(సరళ విస్తృత వ్యాఖ్యాసహిత ఆర్య సమాజ
నియమములు.)  :
1977 లో ప్రచురితమైన ఈ గ్రంధంలో మహర్షి దయానంద సరస్వతి యొక్క హృదయము, ఆర్యసమాజము యొక్క విశిష్టత రచయిత హృద్యంగాను, సరళంగాను వివరించారు.

  ఆర్యసమాజ నియమాలు వేదాలకు సారభూతమని, ఈ నియమాల పాలనము- ఆచరణ-వేదధర్మముల యాచరణే అవుతుందని రచయిత ఈ గ్రంధంలో వివరించారు. కాబట్టే ఆర్యసమాజం ఇతర మతసంస్థలవలె ఒక మతాన్ని ప్రచారంచేసే సంస్థ కాదన్నారు. వేదమతాన్ని-సత్యమతాన్ని- ప్రచారంచేసే- పునరుద్ధరించే ఉత్తముల సంస్థగా అభివర్ణించారు.  ఆర్యసమాజాన్ని వ్యతిరేకించడమంటే వేదమతాన్ని వ్యతిరేకించడమే అవుతుందని రచయిత పేర్కొన్నారు.
5.గీత కాల్పనిక గ్రంధము :  పండితరావు అనే కలంపేరుతో శ్రి జాస్తి వేంకట నసింహారావు  రచయితగా వెలయించిన ఈ  ‘గీత- కాల్పనిక గ్రంధము’ లో నాలుగు భాగాలున్నాయి. 1.గీతలో శ్రీ కృష్ణుడు 2. గీతలో అర్జునుడు 3. గీత ఉపనిషత్తుల సారమా? 4. గీత - రచనాకాలాదులు.
ధర్మగ్రంధముగ ఎంతో ప్రసిద్ధమై ప్రచారంలో ఉన్న‘ గీత’ని గురించి - ఆలోచన కలిగించి, సత్యం గ్రహింపచేయాలన్న సదుద్దేశంతో, ఏటికి ఎదురీతగా రచయిత వెలువరించారు ఈగ్రంధాన్ని.
సత్యం గ్రహించుట - గ్రహింపజేయుట, అసత్యం త్యజించుట - త్యజింపజేయుట ఆర్యులకు ధర్మమని నమ్మిన పండితరావు, గీతాభక్తులనుగాని, కృష్ణభక్తులనుగాని, అవతారవాదులనుగాని నొప్పించుటకు ఈ గ్రంధాన్ని వ్రాయలేదని స్పష్టం చేశారు.
వేదవిరుద్ధములు, మత-సంప్రదాయ-పరకములునగు విషయములు, సిద్ధాంతములు కొన్ని ఉన్నప్పటికి, ఆధ్యాత్మికములు, ధార్మికములు నగు విషయములు గీతలో చాలగలవని నమ్ముతున్నారు ఈ రచయిత.
“అయితే కొత్తవాదం సబబుగా ఉండాలి. యుక్తి యుక్తంగాఉండాలి. సోదాహరణంగాఉండాలి. స్పష్టంగా ఉండాలి. విశ్లేషణాత్మకంగాఉండాలి. పాఠాకుని బుద్ధిని కదిలించేదిగా ఉండాలి. ఈ పుస్తకంలో ఇన్ని లక్షణాలూ ఉన్నాయి” అని కితాబునిచ్చారు, మెచ్చుకున్నారు - ఆంధ్ర ప్రదేష్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గాను, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాద్యక్షులుగాను బాధ్యతలు నిర్వహించిన ప్రముఖులు శ్రీ ఆవుల సాంబశివరావు గారు.
‘అంగీకరించండి, అంగీకరించకపొండి. కాని పుస్తకాన్ని చదవండి, ఆలోచించకుండా ఉండలేరు’ అన్న విశ్వాసాన్ని సాంబశివరావు గారు వ్యక్తం చేశారు.

 6. దాంపత్య సుఖము
7. ధాతు మీమాంస (ఆయుర్వేద మాధారముగ)
8. పూర్వ జన్మ - పరజన్మ
1984 లో ప్రచురితమైన ఈ రచనలో, కర్మ సిద్ధాంతము ననుసరించి జీవుల పూర్వాపర జన్మల విషయాన్ని పరిశీలించారు రచయిత.
 సామాన్యులకు కూడ అర్ధమయ్యే సులభ శైలిలో రచన సాగింది.
రెండు భాగాలుగా ఉన్న ఈరచనలో ముందుగా పూర్వాపర జన్మల విషయాన్ని పరిశీలించి, నిర్ణయించారు,, రెండవ భాగంలో ఆ నిర్ణయానికి వేదశాస్త్ర ప్రమాణాలను చూపించారు.

 9. సూర్యాది గోళములందు జీవరాశి
 10.మృత్యు రహస్యము : మహర్షి దయానంద సరస్వతి నిర్వాణ ఉత్సవాల సందర్భంగా ‘మృత్యు రహస్యము’ అనే గ్రంధాన్ని స్వామి శాంతానంద సరస్వతి వెలువరించారు. (1983)
మృత్యువులోని ఆంతర్యమును, రహస్యమును వివరించి, అపరిహార్యమగు మృత్యువును గురించి దుఃఖింపవలసిన, భయపడవలసిన పనియే లేదని నిరూపించుటయే ఈ రచనకు గల ముఖ్య ప్రయోజనమని రచయిత ప్రకటించారు.
ఈ గ్రంధంలో 1. మృత్యువు దుఃఖకరము కాదు. 2. మరణానంతరము జీవగతులు 3. కర్మ సిద్ధాంతము- అకాల మృత్యువు అనే మూడు భాగాలున్నాయి.
పెక్కు విషయాలు యుక్తి ప్రమాణాలతో పరిశీలింపబడినవి; నిరూపింపబడినవి. సాధ్యమైనంతవరకు తేలిక భాషలో, ఉదాహరణ సహితంగా, సామాన్యులకు కూడ అర్ధమయ్యేటట్లురచన సాగింది.
ఈ గ్రంధాన్ని రచయిత పెద్ద కుమార్తె కుర్రా ఇందుమతి, అల్లుడు సాంబశివరావుల ఆర్ధిక సహాయంతో ప్రచురించారు.

 11. మరణానంతరము జీవుని పరిస్థితి? (మృత్యు రహస్యము-రెండవ భాగము)
మృత్యువు దుఃఖకరము కాదు; సంతోష దాయకము అనే ప్రధాన విషయంగా  ఈ రచయిత ‘మృత్యు రహస్యము’ ప్రచురించారు.
రెండవభాగంగా, మరణానంతరము జీవుని పరిస్థితిని ఈరచనలో వివరించారు.
అనల్పమయిన విషయాలను అల్పంగా కనిపించే ఈ గ్రంధంలో రచయిత  పేర్కొని, పాఠకులను ఆలోచనలో పడవేశారు.
తన ఈరచనకు ప్రేరణ ఇచ్చిన స్వామి రామతీర్ధులకు, రచయిత ధన్యవాదాలు తెలిపారు.
  12. మూర్తి పూజా సమీక్ష


13. ఆధ్యాత్మక విద్య :
   1992 లో ‘శాంతానంద’ గా రచించి,  ప్రచురించిన ‘ ఆధ్యాత్మక విద్య’  అను ఈ గ్రంధంలో- (1) సూష్మశరీర మీమాంస అను సాభా సాంతఃకరణ పరిశీనము (2) శ్రీ దక్షిణామూర్తి స్త్రోత్రము (ఆంధ్ర టీకాతాత్పర్య వివరణోపెతము) అనే రెండు లఘు గ్రంధాలు ఉన్నాయి.
జీవోపాధియగు సూష్మశరీరములోని భాగములను పరిశీలించి సమన్వయ దృష్టితో మననము చేయగా చేయగ స్ఫురించిన భావాలతో ఈరచన ప్రారంభించినట్లు గ్రంధకర్త ‘తొలిపలుకులు’ లో పేర్కొన్నారు.
‘పద్మవిభూషణ’ అచార్య కొత్త సచ్చిదానందమూర్తి ఈ గ్రంధంపై తమ అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియ చేశారు...
‘‘మేధాశక్తి, పాండిత్యాల కంటే సత్యాన్ని కనుక్కోవడంలొ అనురక్తి, దానికై స్వంత బుద్ధిబలంపై ఆధారపడటం, తనకు సత్యంగా తోచిన- కనపడినదానిని నిష్పక్షపాతంగా ప్రకటించటం; ఇవి గొప్పవి. చలా కొద్దిమందిలోనే ఇవి గోచరిస్తయ్. ఈ గ్రంధకర్తలో అవి ఉన్నయ్. ఈ గ్రంధం కంటే దాని రచయితలో ఎక్కువ వైశిష్ట్యం, గొప్పతనం ఉన్నయ్. ......... ....    .... ఇటువంటి జిజ్జాస, మనోధైర్యం, తత్త్వమీమాంస అత్యంత ప్రశంసనీయాలు. ..  ,,    ,,   నేను శ్రీ శాంతానంద స్వాములవారి పాండిత్యాన్ని, పరిశ్రమని, పట్టుదలను అభినందిస్తున్నాను. ....”
  



14 జాస్తి(కమ్మ) వారి వంశ వృక్షములు

No comments:

Post a Comment