Monday, April 4, 2011

కవిబ్రహ్మ-ఏటుకూరి వేంకటనరసయ్య

              శత జయంతి

ఏటుకూరి వెంకట నరసయ్య

 


కవిబ్రహ్మ ఏటుకూరి వెంకట నరసయ్య (జననం: ఏప్రిల్ 1, 1911 - మరణం నవంబర్ 10, 1949) క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, మానవతావాది, కవి ఐన ఏటుకూరి వెంకట నరసయ్య , గుంటూర్ జిల్లా, సత్తెనపల్లి తాలూకా పెదకూరపాడు లో , గండికోట కమ్మ కుటుంబంలో, తల్లి తండ్రులకు ఐదుగురు కొమరులులలో రెండవవాడుగా, ఏప్రిల్ 1, 1911 న జన్మించాడు. చినగూడూరు,అమృతలూరు మరియు సిద్ధాశ్రమం (తెనాలి తాలూకా) లో విద్యాభ్యాసం జరిగింది. కవిరాజు త్రిపురనేని ప్రభావంతో పరస తాళ్ళూరు గ్రామానికి చెందిన యువతి తో దండల వివాహం చేసుకొన్నాడు. నలుగురు పిల్లలు. బెంగాలీ సంస్కృతి ప్రభావంతో కుమారులకు రవీంద్రనాథ్ (చనిపోయాడు), హిమాంశు రాయ్ (విశ్రాంత ఉప తహసిల్దారు) అని నామకరణం చేశాడు. కుమార్తెలు ఝాన్సీ లక్ష్మి, మాంచాల. తొలుత గురిజాల ఆ తరువాత నిడుబ్రోలు జిల్లా పరిషత్‌ హైస్కూలులో (1948 -1949 ) అధ్యాపకుడిగా పనిచేశాడు. కొండవీటి వెంకటకవి, అభ్యుదయ మానవతావాది ఐన ఆవుల గోపాలకృష్ణమూర్తి ఇతనికి సన్నిహితులు. ఎం.ఎన్.రాయ్ ఉద్బోధించిన పునర్వికాసం, వైజ్ఞానిక ధోరణి కి ఊతమివ్వటానికై ఆవుల గోపాల కృష్ణమూర్తి త్రిపురనేని, ఏటుకూరి వెంకట నరసయ్య రచనలకు విస్తృతంగా ప్రచారం కల్పించాడు.
రచనలు: క్షేత్రలక్ష్మి -పద్య కావ్యం, పల్నాటి యుద్ధం నేపధ్యంగా పలనాటి వీరచరితము (ఇది ఐదు భాగాలు - అలుగురాజు (రెండు భాగాలు) ,నాయకురాలు, అలరాజు, మాంచాల ), నీతిమంజరి , రైతు హరికధ, సిద్ధాశ్రమము, ప్రేమ లోకం (గ్రామీణ ప్రేమ గాధ), అంగద రాయభారము(లభించుటలేదు).
చందమామ మాస పత్రిక ఈయన నీతి వాక్యాలు ప్రచురించినది . గోవాడలో జరిగిన సాహిత్య పోటీలో రైతుహరికథ ఎంపిక కాగా కవిబ్రహ్మ అని బిరుదు ఇచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, ఏటుకూరి వెంకట నరసయ్య పేరు పై సాహిత్యకృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చేలా ఒక బహుమతిని నెలకొల్పింది.
వికీపీడియా నుండి...

YETUKURI VENKATA NARASAYYA (b.1911,d.1949)

Came of an agriculturist family from Palnadu area, the legendary land of warriors and warrior women. He was fascinated by the scenic beauty and ageless life of Palm\nadu on one hand, and fired by nationalistic zeal on the other. He championed the cause of peasants and tried to catch the rhythms of the folk-life of Palnadu in his kavyas.
Broadly, his poetry can be divided into three categories: first, his poems like KSHETRA LAKSHMI and RAITU HARIKATHA which champion the cause of the peasants; second, poems like PREMALOKAM, TRIVENI, NEETIMANJARI, etc. which deal with social reforms; third, poems which are inspired by patriotism, nationalism and socio- political awakening. VEERA BHARATAMU, his magnum opus, belongs to the third category. His other works include: SIDDHASHRAMAMU, ALUGURAJU, NAYAKURALU, MAGUVA MANCHALA, GATHAVALI, RUDRAMA DEVI, and BALACHANDRUDU(prose).
In most of his kavyas, the heroic sentiment is the dominant spirit. In KSHETRA LAKSHMI the poet portrays the daily routine of the peasant and shows his problems. The setting and rising of the sun, the homeward return of cattle in the evening, the scaring away of birds from the crops by women folk standing on scaffolds in the middle of cornfields with slings in their hands, and such other scenes are described by the poet in this work. In premalokam he depicts the nobility and loftiness of exlated love. Verbal felicity and narrative technique are well-exhibited in SIDDHASHRAMAMU, while TRIVENI unfolds the scientific knowledge of the poet. NEETIMANJARI is a collection of morals on the lines of TIRUKKURAL.
In VEERA BHARATAMU the poet dwells on the communal harmony preached by Brahma Naidu, the statecraft of Nayakuralu, the matchless valour of Balachandrudu, and the selfless romance and exalted love of Manchala. Unlike other poets, Yetukuri portrays Nayakuralu not as a villainous woman greedy of power, but as a great warrior and as able leader of people. The poem filled the people with nationalistic fervour in their fight against the British. In another poem Rudrama devi, the poet sang of the great Kakatiya empress and warrior queen who ruled her kingdom gloriously for over forty years. She was another source of inspiration to the people.
Venkata narasayya`s style is a mixture of tradition and modernity. Traditional values and modern views are blended in his works. He never weighs down his poetry with obscure flights of imagination or figures of speech like hyperbole, etc. He was a poet who actually tilled the land, mixed with common people and shared their moments of joy and sorrows in life. He added many new words to telugu lexicon by using in his works native idioms, colloquial expressions, and other phrases used by the people of Palnadu region.  - Y.RO
(The Encyclopaedia of Indian Literature- Volume Five, Pages4539&4540; published by Sahitya Akademi-New Delhi)

సాహిత్య మాగాణుల్లో ఏటుకూరి వెంకట నరసయ్య

ఏటుకూరి వెంకట నరసయ్య
(స్మారక సంచిక నుండి-1948)

ఏటుకూరి ఆంధ్ర సాహిత్యలోకానికి చిరపరిచితులు. ఆంధ్ర ప్రజల ఆదరాభిమానములను పొందినవారు. ఇరవై సంవత్సరాలు తెలుగు సాహిత్య మాగాణుల్లో విహరిస్తూ, పట్టుతప్పని స్వాతంత్ర్య గరిమజూపి తెలుగు భాషకు కొత్తరికాన్ని తెచ్చిపెట్టిన నిర్భయ పలవాటికవి.
నరసయ్య విశిష్టకవి. భాషాపాండిత్యం, కవితా హృదయం సమపాళ్ళుగా పొదుపు చూపిన పండితకవి. కవి పండితుడు. భావమందు శైలియును, భాసుర శైలిని మించు భావము కలిగినవాడు. అతడొక కావ్య తపస్వి. చేతికివచ్చినదల్లా వ్రాయక, ఒక నియమం. ఒక భావం, ఒక ప్రణాళిక కలిగించాడు. ఒక్కొక్క కృతిని ఒక్కొక్క రీతికి నిగళసూత్రంగా చిత్రించి, వెలార్చినవాడు.
సుద్దులతో సాహిత్యంలో అడుగుపెట్టి, నీతిమంజరి రచించి, రైతుగాథల్లో శ్రావ్య కవితాగాన స్రవంతుల నుంచి క్షేత్రలక్ష్మిని నిగదించి, ప్రేమమయ జీవితాన్ని ఆకాంక్షించి, ప్రేమాలోకం నిలకడగల నుగ్గుదేరిన తెనుగునుడికారంతో నింపివేసి, కథలో పాత్రల్లో, కవిత్వంలో అందెవేయించి, .మగువ మాంచాల”, “నాయకురాలు”, “రుద్రమలను స్త్రీత్వప్రాతినిధ్య ప్రతిభా విభాసినులనుగాయేర్చి, కూర్చి తెలుగు తల్లుల మగటిమ చూపాడు.
సంస్కృతంలో నరసయ్య, వరుసలుగా పరవళ్ళు త్రొక్కే రీతిలో రచన చేయగలిగిన సత్తాను చూపాడు.
కవిబ్రహ్మ తాను మాటిమాటికి పలనాటి వాడనన్న, అహం, మరచేవాడు కాదు. అందుకే పలనాడన్న దిగంత అని యెంతగానో దొర్లించేవారు.
పలనాటిని బయటికి లాగాడు. భారతాన్ని లేవదీశాడు. అది కవిత్రయ భారతం. వాగమశాసనులు. కవిబ్రహ్మలు, ప్రబంధ పరమేశ్వరులు రచించినది, ఇది యేకైక కవి భారతం, తానే వాగను శాసనునిగా, ప్రబంధ పరమేశ్వరునిగా కవి బ్రహ్మగా రూపొంది, విజ్జి రాల్చినాడు. తిక్కయజ్వ తానై రహిమై వెలార్చినాడు.
అది వుత్తరాదివారిగాథ, యిది తెలుగు జోదుల వీరగాథ, అందుకే వీరభారతం.
కవి బహుముఖ పాండిత్యాన్ని ప్రకర్షించటమేకాక, తన సాంఘికాభిరుచుల్ని మనోజ్ఞ రీతుల్లో త్రివేణిగా చూపాడు.
అసలు తిక్కనదొట్టి నేటివరకు లేని తెలుగుదనాన్ని తెలుగు భాషలో చూపిన సాహసాంకుడు. ప్రాత క్రొత్తలందుల్లముసేర్చి, తనకొల్లనిదేమి.... లేక రసస్వరూపాన్ని, శబ్ద స్వరూపాన్ని నూతనాకృతిలో నిగదించాడు. తెలుగుకు అమూల్యమైన సేవ చేశాడు. ఆయన కావ్యాకృతిలోకి తెచ్చిన పదాలు, చేర్చిన మాటలు తండోప లబ్ధిగావున్నవి. అవి ఆయన విశిష్టతను చాటగలవు. జీవద్భాషగా తెలుగుకు పరిపుష్టి, తుష్టికూర్చినాడు మన సరసకవి.
సమకాలిక సాహిత్యరంగంలో నాలుగు కాలాలపాటు నిల్వగల్గి రచనలు చేసిన వారిని వేళ్ళమీద లెక్కించవచ్చును. అందులో వేంకటనరసయ్య ఒకరు. వారి కావ్యరచనా విశ్వాసాన్ని మగువ మాంచాలలో చూడవచ్చును. మాంచాల మనోజ్ఞమైన సృష్టి. వీరభారతం పెద్దకోవకు చెందిన రచన. ప్రణాళికాబద్ధ రచన. అలరాజు రాయబారంలో తిక్కన పోకడలను, తిక్కన రచనలుగా, ఆయీ కవిబ్రహ్మల భాషా సామ్రాజ్య సామ్యాన్ని చూపాడు. మరెన్నో ప్రణాళికలు కలవు. తీరని రీతిలో కవి అంతరించటం తెలుగు సాహిత్యానికే కుంటుతనం వచ్చింది. స్నేహితుడుగా వేంకట నరసయ్య వెన్నపూసలాంటి వాడు. వాక్కులో కాఠిన్యత లేకపోలేదు,. ఆయన వీరభారతం అసమగ్రంగానే వుంది. కవిబ్రహ్మకు వుద్దీ యెప్పుడు వచ్చి, యీ పురాణభారం వహిస్తాడో చూడవలసి వుంది.

శ్రీ ఏటుకూరి జీవితరేఖలు-కవితా వైశిష్ట్యము
                                   రచన: శ్రీ త్రిపురనేని సుబ్బారావు
ఏటుకూరి వెంకట నరసయ్య గారు గుంటూరు జిల్లా లోని పెదకూరపాడు గ్రామంలో 1911 సం.లో ఏప్రిల్ ఒకటవ తేదీన జన్మించారు. తండ్రి పేరు భూషయ్య గారు. తల్లి శేషమ్మ.
తమ బిడ్డలు తమకంటే ఉత్తములు కావాలనీ, తమకు పేరు ప్రతిష్టలు తీసుకు రావాలనీ, అందరు తల్లిదండ్రులూ సహజంగా ఆశిస్తారు. భూషయ్య దంపతులు కూడా అలానే కలలు కన్నారు. తమ స్వప్నాలను యదార్ధం చేయడం కోసం వారు నరసయ్యగారికి విద్యాభ్యాసం చేయించారు. ఆ ఉత్సవ సందర్భంలో సదస్యులకు చక్కెరను పంచిపెడుతూ పంతులుగారు “ఈ చక్కెర కమ్మదనంలా మీ ఇంటా బయటా కూడా కమ్మదనం వ్యాపించాలి” అన్నారు.
ఆ ముహూర్తబలమెటువంటిదోకాని, నరసయ్య గారికి చదువు మీద ధ్యాసలేకుండా పోయింది. పొలాల వెంటా, పుంతల వెంటా తిరుగుతూ వుండేవారు. దీనిఫలితం బడికి వెళ్ళిన రోజున ఇబ్బడి ముబ్బడిగా అనుభవించవలసి వచ్చేది. గోడకుర్చీలువేయడమే కాదు, కోదండం తీయడమే కాదు - ఇవ్వన్నీ నరసయ్యగారు అనుభవించ వలసి వచ్చేది. కొడుకు గుణగణాలేమిటొ భూషయ్య గారికి తెలుసు. నరసన్న తెలివితక్కువ వాడా? కాదు. అయితే చదువంటే ఎందుకలా బెదిరిపోవడం? చెప్పే విధానంలో ఏదో లొసుగున్నదని భూషయ్యగారు భావించారు. ఆంధ్రమహాభారత ప్రతిని తెప్పించి పురాణకాలక్షేపం చేయించసాగారు. బడి అంటే ఠారెత్తిపోయే నరసయ్యగారు తండ్రివొడిలో కూర్చుని మహాభారతం ఆసాంతం విన్నాడు. ఆ నాటి మహాభారత శ్రవణ ప్రభావం వారి జీవిత వైఖరిని మార్చివేసింది. చదువు పట్ల ఆసక్తిని ఇనుమడింపచేసింది.
 భూషయ్యగారికున్న సందేహం కాస్తా పటాపంచలయింది. చదువు రాకపోవడానికి కారణం తన కొడుకు నిర్లక్ష్యం కాదనీ, తగిన గురువుంటే తన కొడుకు చక్కగా చదువుకుంటాడని నిశ్చయించారు. మంగయ్య శాస్త్రిగారి వద్ద అమరము, పంచకావ్యాలు చెప్పించారు. ఆ రోజుల్లోనే నరసయ్యగారు చందోబద్ధమైన పద్య రచన చేయడం మొదలెట్టారు.
మిత్రులు, బంధువులుకూడానరసయ్యగారిని సంస్కృత భాషలో కృషిచేయవలసిందిగా ప్రోత్సహించారు. ఫలితంగా వారు అమృతలూరు చేరుకున్నారు. శ్రీ మైనేని వెంకటప్పయ్య, శ్రీ స్వామినాధశాస్త్రి గారలవద్ద సంస్కృతకావ్యాలు, వ్యాకరణమూ పఠించారు. నర్సయ్యగారికి పాణినీయం చదువుకోవాలనే కోరిక గలిగింది. వెంటనే వారు ముత్తుపల్లి అగ్రహారం చేరుకున్నారు. అయితే అక్కడ చదువు సంధ్యలు సరిగ్గా జరగలేదు. విద్యా తృష్ణతో మక మకలాడిపోతున్న నరసయ్యగారిని తెనాలిలోని సంస్కృత కళాశాల ఆహ్వానించింది.
ఆ సమయంలోనే నరసయ్యగారికి, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారికి పరిచయం ఏర్పడింది. కవిరాజు గారి ప్రోత్సాహంతో, నరసయ్యగారు కొవ్వూరులోని గీర్వాణ విద్యాపీఠంలో కొంతకాలంఉన్నారు. ఆ తరువాత విజయనగర సంస్కృత కళాశాలలో కొంతకాలం చదివారు. అక్కడి వాతావరణం వారికి సరిపడక తిరిగి తెనాలి రావలసి వచ్చింది.
తెనాలి చేరుకొన్న తర్వాత ఒక సంవత్సరంపాటు మహోపాధ్యాయ ముదిగొండ నాగలింగ శాస్త్రిగారి వద్ద విద్యార్ధిగా వున్నారు, “ఆంధ్ర భాషలో నాకు అభిరుచిని కలిగించిన మహామహులు శ్రీ నాగలింగశాస్త్రిగారు” అంటూ వుండేవారు. దీనికి తోడు కవిరాజుగారి “సూతాశ్రమమ్”వీరి కవితాశక్తిని తీర్చిదిద్దింది. రామస్వామి చౌదరిగారు నరసయ్యగారి సాహిత్యజీవనానికి ఎంతగానో దోహదంచేశారు.
ఆ రోజుల్లో సంస్కృతభాషాభ్యాసం బ్రాహ్మణులవరకే పరిమితమై వుండేది. బ్రాహ్మణేతరులు సంస్కృతం చదవకూడదనేవారు. ఈవాదానికి ప్రతికూలంగా శ్రీమాన్ గుదిమెళ్ళ వరదాచార్యులుగారు చిట్టిగూడూరులో “నారసింహ సంస్కృత కళాశాలను స్థాపించారు. అన్ని కులాలవారికి, అన్ని మతాల వారికి ఈకళాశాలలో ప్రవేశించే అర్హతఉంది. కవిరాజుగారినుండి ఒక పరిచయ లేఖను పుచ్చుకొని నరసయ్యగారు చిట్టిగూడూరువెళ్ళారు. అక్కడ విద్యార్ధిగా ఉంటూనే జాతీయోద్యమంలోకూడా పాల్గొనసాగారు. రాజకీయాలు వారి చదువును అరికట్టలేదుగాని, నరసయ్యగారికి మాత్రం లాఠీదెబ్బలను ప్రసాదించాయి.
1933 సం.లో ఉభయభాషాప్రవీణ పూర్తికాగానే గుంటూరు జిల్లాబోర్డులో ఉపాధ్యాయుడుగా చేరారు. చేరిన తర్వాత వివాహం చేసుకొన్నారు. ఆ వివాహంకూడా ఒక పూలదండ సాక్షిగానే జరిగింది. వారి ఆదర్శవివాహం పరిసర గ్రామీణ ప్రజల డాబుదర్పాలకెంతో సిగ్గు గలిగించింది.
నరసయ్యగారు గొప్ప సంఘసంస్కర్త. కవిరాజుగారి ‘వివాహవిధి’ ననుసరించి వారు ఆంధ్రదేశంలో వందలాది వివాహాలు జరిపించారు. బాజా భజంత్రీలతో జరిగే బూటకపు వివాహాల తతంగం వారికేమాత్రం గిట్టేదికాదు. ప్రకృతి సాక్షిగా పిల్లా-పిల్లవాడూ ఇష్టపడి ముడిపెట్టుకోవడమే మంచిదని వారి నిశ్చితాభిప్రాయం.
1935 సం.నుండి పూర్తిగా కవితా వ్యాసంగంలోకి దిగారు నరసయ్యగారు. వీరి కవితా సుందరి బహుముఖ సారస్వత వీధుల్లో విహరించింది. “అలుగురాజు”, “నాయకురాలు”, “మగువమాంచాల”, “ప్రేమలోకము”, సిద్దాశ్రమము”, “క్షేత్రలక్ష్మి”, “త్రివేణి”, “నీతిమంజరి”, “బాలచంద్రుడు”, “రైతు హరికధ”, “గాధావళి”, మొదలైనవి వీరి ముద్రిత గ్రంధాలు. ఇవిగాక “రుద్రమదేవి”, “అలరాజు రాయబారము”, “నిరుద్ధ సైరికము”, “అంగద రాయబారము”, “ప్రతాపసింహ”, “బుద్ధిజీవులు”(నవల), “జిబిలిక”(గేయకావ్యం), “చందమామ గేయకధలు” వీరి అముద్రితాలు.
నరసయ్యగారి బహుముఖ సాహిత్యసేవను యావదాంధ్రదేశమూ గుర్తించింది. దీనికి నిదర్శనంగా “గుంటూరు రైతు సాంఘం” వారు వీరికి “కవిబ్రహ్మ” బిరుదునిచ్చి తగురీతిని సత్కరించారు. ఆ సందర్భంలో వెంకటనరసయ్యగారు “పూలదండలనెన్నింటినైనా భరింతునుగాని ఈ నాలుగు అక్షరాలు భరించుటకు నాహృదయం ఎంతో జంకుతున్నది” అని వారి నిరాడంబరత్వాన్ని వెల్లడించారు. సువర్ణాక్షరాలతో లిఖించిన ‘కవిబ్రహ్మ’ బిరుదాంకితమైన సువర్ణఫలకం నరసయ్యగారికి బహూకరింపబడింది.
ఆంధ్ర దేశంలోని ముఖ్య పట్టణాలలోనే కాకుండా మారుమూలలలోఉన్న గ్రామాలలో సైతం వారికి అఖండ సన్మానాలెన్నో జరిగాయి. అమలాపురం, అమృతలూరు, దుగ్గిరాల, దువ్వూరు, మదరాసు, జాగర్లమూడి, గుంటూరు, గోవాడ, తెనాలి, తణుకు, మొదలైన గ్రామాలు, పట్టణాలు వారిని సన్మానించి తమ కవితాభిలాషను చాటుకొన్నాయి.
“ఈయన కవితావల్లి పల్నాటిలో పుట్టి, అమృతలూరులో అల్లిబిల్లిగ నల్లుకొని, తెనాలి సూతాశ్రమంలో క్రొన్నలదొడిగి, చిట్టిగూడూరులో పుష్పించి, వికసించి, ఘుమఘుమలు వెదజల్లుతూ ఫలించి గోవాడలో బ్రహ్మత్వం పొందింది” అన్నాడు ఒక ప్రఖ్యాత రచయిత.
వేంకటనరసయ్యగారు “కవిబ్రహ్మత్వం” పొందిన తరువాత అఖిలాంధ్ర కవిపండిత సజ్జన సన్మానం చేయాలనే ఆకాంక్షతో “కవిబ్రహ్మ సన్మాన సంఘం” తెనాలిలో ఏర్పడింది. సమున్నత స్థాయిలో సన్మానం చేయాలనే సత్సంకల్పముతో ఆ సంఘం తన కార్యక్రమాన్ని ప్రారంభించింది. సన్మానవార్త ఆంధ్ర దేశమంతటా మలయగంధంలా వ్యాపించింది, అసంఖ్యాకంగా కవులు, రచయితలు, తమతమ రచనలను అందచేశారు. ప్రజలు ఆదరాభిమానాలతో విరాళాలను సమర్పించారు. అన్ని వర్గాలనుండి సమధికమైన ప్రోత్సాహమూ, ప్రోద్బలమూ లభించాయి. అనుకొన్న ప్రకారం సన్మానం జరగడానికి అట్టే వ్యవధి లేదు. కాని ఆశ అడియాస అయింది. కధ అంతా ఒక్కసారిగా అడ్డం తిరిగింది. వేంకటనరసయ్యగారికి జ్వరం తగిలి హఠాత్తుగా 1949 సం. నవంబరు 10వ తేదీ రాత్రి  కీర్తిశేషులయ్యారు. పిడుగులాంటి ఈవార్త వారి అభిమానులను విచార సాగరంలో ముంచివేసింది. ఎంతో బ్రహ్మాండంగా చేయాలనుకొన్న “సన్మానం” అనుకోని “స్మారకం”గా మారిపోయింది. ఆనాటితో నవ్యాంధ్ర కవిబ్రహ్మ కధనం పారశీకపు పిరదౌసి కోవలో చేరిపోయింది.
ఏటుకూరి వేంకటనరసయ్యగారి జీవిత విశేషాలను గుర్తించి తెలుసుకొన్నాం.  స్థాలీపులాకన్యాయంగా వారి కవితలోని కమనీయతను చవిచూద్దాం.
మన భాషలో ప్రధానమైన సాహిత్యశాఖలు రెండున్నాయి. గతానుగతికంగా వచ్చే ‘సంప్రదాయ శాఖ’ ఒకటి- ఈ వాతావరణంలో ఇమడని ‘విదేశీ ప్రభావంగల శాఖ’ మరోటి- ఈరెండు ముఖాలుగా సాహిత్య స్రవంతి ప్రవహిస్తున్నది. ఈరెండింటిలోనూ, ఏ ఒక్కదానిదీ సరియైనమార్గం కాదని నరసయ్యగారి అభిప్రాయం. రెండు విధానాలలోని మంచినీ సమన్వయపరచడం అవసరమనుకొన్నారు. ‘వీరభారతంలో’ ఆపని చేశారుకూడాను చూడండి:
“తొల్లిసడల్ప కిప్పటివిధుల్ నిరసింపక ప్రాతకొత్త అం/
దుల్లముజేర్చి దేశికవితోచితమార్గములన్ గమించు మా/
కొల్లనిదేమికద్దు వివిధోజ్వల కావ్యకధార్ధయుక్తులం/
దల్లరిపాలుగాని కవితాసవమానెద మెల్లవేళలన్”
అలనాడు తెలుగు వీరుల కవోష్ణరుధిరంతో పొంగి, శౌర్యోత్తుంగ తరంగాలతో ప్రవహించి, నాగులేటి మాటున రూపెత్తి, సకలాంధ్రదేశానికే గర్వచిహ్నంగా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది పలనాడు. అలాంటి పలనాడు ఈనాడు -
“పంపకములూన్చు కాట్రేనిబండలేమి/
కోళ్ళఢీకొల్పు నఋజులగుట్టలేమి/
కదనరంగమ్ములను పచ్చగడ్డలేమి/
బావురనుచున్న వీనాటి పల్లెనాట”
-   -   -    -    -   -  - -
భస్మమైనది పలనాటి ప్రాభవమ్ము/
మాయమైనది ప్రజకైకమత్యబలము/
వైష్ణవమ్మని బ్రహ్మన్న వరుసదప్పె/
శైవమని నాగసాని వచ్చకుచెనంగె.’

అది ఈనాడు నామమాత్రావశేషమై, దుర్భర దారిద్ర్యంతోనూ, అనాగరికతతోనూ, అలమటిస్తూ వున్న సమయంలో దాని వీరగాధను తన ముక్త కంఠంతో  మధురాతి మధురంగా గానంజేసి, ప్రాచీన ప్రాభవాన్ని ప్రబోధం చేసిన మహామనీషి శ్రీ ఏటుకూరి. ‘జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపిగరీయసీ’ అన్నారుగదా? అందుచేత తన జన్మభూమి అయిన పలనాటియందుగల గౌరవాన్ని ఇలా వెల్లడించారు:
“వీరాంగనా రక్తధారాస్రవంతిలో/
జలకమాడినది నా జన్మభోమి/
విపులాంధ్రమేదినీ విజయరంగమునందు/
గజ్జె గట్టినది నా కర్మభూమి/
విక్రమస్ఫూర్జిత వీరగంధమ్ముచే/
బులకరించినది నాపుణ్యభూమి/
విమలకీర్తిప్రభావిభవాభిరామమై/
తేజరిల్లినది నా దివ్యభూమి/
పల్లెనాట జనించిన ప్రాణకోటి/
నేనునిల్పినకీర్తితో నెగడవలయు.”
------------------------------
---------------------------
ఇలాంటి వీరభూమిలో జన్మించడంవల్లనే వేంకటనరసయ్యగారికి చిన్ననాటినుండి వీరులకధలంటే మిక్కిలి మక్కువగా ఉండేదేమో! వారే స్వయంగా ఇలా చెప్పుకొన్నారు:
“నే నిటువంటి వీరధరణిన్ జనియించినవాడగాన మ/
న్మానసరాజహంస మసమాన తదీయకధాసుధానదిన్/
స్నానములాడు; నేసుకృతజన్మఫలమ్మున కగ్గమైతినో/
గాని, తదీయదృశ్యములు కన్నులగట్టు యధాతధమ్ముగన్”.
వీరసపరిపుతంగా పల్నాటిగాధకు ప్రాణ ప్రతిష్ఠ చేయడంలోనే ఏటుకూరివారి మేటితనం స్ఫష్టమౌతుంది. మగువ మాంచాలలోని ఒక్కొక్క పద్యం ఒక్కొక్క రసగుళిక. మచ్చుకో రెండు పద్యాలు చూడండి:
“ద్వాదశ శతాబ్ద యుద్ధగాధలు మధింప/
బయలుపడ్డ ప్రతాపాగ్ని భస్మమయ్యు/
పల్లెనాడ స్మదాంధ్రప్రపంచమునకు/
బౌరుషజ్యోతియని పేరు వడినదపుడు.”

“నాటి రణకధలూకొన్న నాగులేరు/
గుండెనీరయి పరుగిడుచుండునెపుడు/
కుమిలియేడ్చు తరంగగర్భములనుండి/
వెలువరింపకదాచె మా వీరగాధ.”
పాత్ర్ పోషణలో నరసయ్యగారిది పోలికలేనిచేయి. పల్లెనాటి పడుచునుగూర్చి వ్రాసినపద్యం ఆంధ్రనారీలోకానికే గర్వకారణంగా గోచరిస్తుంది. కవిబ్రహ్మ లేఖిని ఎంతసేపటికి వీరరసము నాశ్రయిస్తుంది. ఈ పద్యాన్ని పరీక్షించండి:
“మగవాడనని సారెతెగనీల్గు నాపను/
గాటందదె పల్లెనాటబిడ్డ/
బరిద్రొక్కపైకొను పగరగుండెలతోడ/
వేటలాడదె పల్లెనాటి పడుచు/
కరకుగత్తులనూరు నెరజోదుకండల/
నమిలి మ్రింగదె పల్లెనాటి పడతి/
పడగెత్తి చెలరేగు పరిపంధిశిరములన్/
గోట మీటదె పల్లెనాటి మగువ/

చెరిగిపోలేదు మావారి చరితలందు/
బచ్చిరక్తము విరజిమ్ము పసిడివ్రాలు.”
----------------------
---------------------
ప్రత్యేకంగా నాయకురాలినిగూర్చి ఇలా అన్నారు.
“ఆంధ్రులకు నామెపేరు విన్నంతమాత్ర/
నొడలు పులకరించు నావేశ ముప్పతిల్లు/
ఎందరో పుట్టిపెరిగినా రింతులందు/
నిట్టివ్యక్తి జనింపలేదింతదనుక.”

ఇందులో నాయకురాలి ఉదాత్తచరిత్ర కళ్ళకు కట్టినట్టు చిత్రించబడింది.
మాంచాల తెలుగుబిడ్డ; మానధనులైన గండు వారింటి ఆడపడుచు, వీరవనిత, సౌందర్యరాశి, విద్యావివేకశాలిని, సమస్తశాస్త్రము లెరింగిన ప్రోఢ, అనుగుణవయోరూపముల నొప్పు బాలచంద్రుని మగువ, జాతికి మేలుబంతి. ఆమె బాలచంద్రుని రణోన్ముఘునిచేయడానికి పలికినపలుకులు కలకాలం హృదయంలో భద్రపరచుకోదగినవి.
“చచ్చిన పలనాడు పుచ్చలబీడు/
బ్రతికిన పలనాడు రతనాలవీడు/
వీరాధివీరులు నీరుగాలేదె;/
మనమెల్లరము నిల్తుమనుమాట నిజమె?”
భారతవీరుల శౌర్యాగ్నిచ్చ ఉలను వీరభారతం నాలుగు చెరగులకూ పంచిపెడుతున్నది. భీరులను వీరులుగా మార్చివేస్తున్నది. ఈ కావ్యం చదవని తెలుగుబిడ్డ కనుపించడంటే అతిశయోక్తికాదు. ఆంధ్ర సాహిత్యంలో ఈగ్రంధం ఒక మణిపూసలాంటిది.
అఖిలజనాళికి అన్నదాత అయిన కర్షకునికి ఈ కవి అంజలి ఘటించాడు. రైతును, అతని రసమయ జీవితాన్నీ పరిశుద్ధ ఆచారాలనూ “క్షేత్రలక్ష్మి”లో అతిరమణీయంగానూ. హృద్యంగానూ,చిత్రించారు. అదొక సర్వతంత్ర స్వంతరచన. ఒక మహోజ్వల మహోన్నతకావ్యం. దేశానికి వెన్నెముక అయిన రైతుపై శ్రద్ధచూపవలసిందిగా ఈకావ్యంలో కవిబ్రహ్మ సకల ప్రజానీకాన్నీ ఉద్భోదించారు. చూడండి:
“ఇంతకు నాపరాత్పరునకే దయకల్గిన రైతురాజ్య మ/
త్యంత విభూతి బెంపసగదా/ మన కర్షక సార్వభౌముడే/
అంతములేని యీభువనమంతకు శాసనకర్తయై నిర/
భ్యంతరపాలనం బొనరుపంగల భాగ్యము గల్గు టెన్నడో!”
“ప్రేమలోకం” కావ్యంలో డబ్బుకాశించి చేసే వివాహాలను గర్హించారు నరసయ్యగారు.
సంఘంలో పతనావస్థలోనున్న నైతిక విలువలను పునరుజ్జీవింపజేయడానికి కవిబ్రహ్మ “నితిమంజరి” రచించారు. అందులోని ఈపద్యం తిలకించండి:
“పొరపాటు లేనివారిని
పొరుగుసహాయం బొకింత పొందనివారిన్
మరణంబు లేనివారిని
తరమా! కన జిత్రగుప్త దస్తరమందున్”
వీరభారతంలో బ్రహ్మనాయని ప్రజామత సామరస్యం, నాయకురాలి మంత్రాంగం, బాలచంద్రుని రణకౌశలం, మాంచాల సహనశక్తి,నిర్వీర్యమైన జాతికి జవం, జీవం పోశాయి. క్షేత్రలక్ష్మిలో రైతు దైనందినచర్య, ప్రేమలోకంలో ప్రణయ పారమ్యత, నీతిమంజరిలో నీతిసారం ప్రత్యేకంగాపేర్కొన బడ్డాయి.
కవిరాజు సాహిత్యపుంతల పొంతలలో పయనించిన కవిబ్రహ్మ, వారిభావాలను బాగా ఆకళింపు చేసుకొన్నారు. లోకాన్ని పెద్ద శ్మశానంగా తయారుచేస్తున్న దైవీభావంమీద కవిబ్రహ్మకూడా పూర్తి విశ్వాసరాహిత్యాన్ని నాయకురాలి ముఖతః వెల్లడించారు. ఈ పద్యం గమనించండి:
“నాయత్నంబెపుడేని పౌరుషప్రదానం బజ్ఝులెందేని దై/
వాయత్తంబని నీరసింతురు మదీయారంభముల్ సంతత/
శ్రేయోదాయకముల్ పరాజయములే జీవించి నన్నాళ్ళు నా/
చాయం జూడవు చూచినన్ వెరువ నీషణ్మాత్ర మెప్పట్టునన్”
మానవునికి మానవునికి మధ్య అడ్డుగోడలుగా నిలిచిన కుల, మతాలమీదకూడా నరసయ్యగారికి విశ్వాసంలేదనడానికీపద్యం జవాబు.
‘ఏమతమైన నేమి? ప్రజకించెడిదాతని వీరవైష్ణవ/
మ్మేమతమంట;దేవుడతనేనట, తన్ను భజించువారికే/
కామకమోక్షమంట మతకర్తలతో యతిరాజతత్వమా/
మోమున మొల్కలెత్తెనట మోసము దోసముగా కిదేమగున్”
అస్పృశ్యతా విషయికమైన భావాన్నికన్నమనీడు నోట ఇలా పలికించారు.
“నాజాతి దెప్పిపొడిచితి/
వేజాతికిలేవు తూటులెవరైన నొకే/
యోనిజనింతురు దుఇరుసున/
యోజింపవు నఖముఖాల నూడిపడెదరే?”
నరసయ్యగారి కవితలో అక్కడక్కడా ఈనాటి రాజకీయభావాలుకూడా కొన్ని గోచరిస్తున్నాయి.
“వీరులు పుట్టుదేశమున విప్లవముల్ చెలరేగు నందుచే/
ధారుణిలోన శాంతియుతధర్మము లేర్పడు దానిచే బ్రజా/
ధోరణిమారు నప్పుడొక త్రోవకువచ్చు బ్రభుత్వమంతటన్/
చేరు ప్రతిష్ఠలొందుచు సుభిక్షములై నెగడున్ స్వరాష్ట్రముల్,”
ఒక్క మహాకవి ఒక్క పద్యాన్ని మహోదాత్తంగా మలచగలుగుతాడు, తిక్కన సమవృత్తాలను, వేమన ఆటవెలదులను, శ్రీనాధ కవిసార్వభౌముడు సీసాలను అనితర సాధ్యంగా రూపొందించారు. నరసయ్యగారికి సీసపద్యమంటె మక్కువ. శ్రీనాధుని వన్నెచిన్నెలను, గంభీరగమనాలను, వారు తమ సీసపద్యాలలోకి తీసుకురాగలిగారు. పాఠకులను మంత్రముగ్ధులను చేయగల ఆ తూగును గమనించండి:
“ఏనాడు చిందెనో? యీపౌరుషాగ్నిలో
            రణదాహముడిపిన రక్తకణము/
ఏనాడు మ్రోసెనో? యీనాగులేటిలో
           భోరుభోరని యుద్ధభేరిమ్రోత/
ఏనాడు కూర్కెనో? యీనాపబండల
           గురుపెట్టి మన్నీలగుండెకాయ/
ఏనాడు త్రెంచిరో? యీపాటిరేవులో
          పుట్టినల్లలు, దాళిబొట్టు త్రాళ్ళు/

అభయానకఘట్టమ్ము లాలకించి/
గుండెలన్ గుప్పిటం బట్టికొందురిపుడు/
వారివెతలెల్ల గతలయి తారసిల్లె/
శ్రీమదాంధ్ర ప్రజా భావసీమలందు.”
కవిబ్రహ్మ శైలి, ఆపాతమధురంగావుండి, బెదిరిన జెర్రివలె గబగబా పరుగులెత్తుతూ ఉంటుంది.
“గుబగుబలాడెముందు సుడిగుండమొకండట నెత్రుసుళ్ళుపై/
కుబికినటుల్ కబంధతతులుంకినటుల్ మను బోతుగుండెలన్/
గుబికినటుల్ గనంబడ దిగుల్పడెదీల్పడెనింతలోసఖుల్/
గబగబనేగుదెంచి వగకారణ మారయ గొంకు చున్నెడన్,”
కవిబ్రహ్మ కవితలో జాతీయత పొంగిపొర్లుతూ ఉంటుంది. సందర్భానికి ఠక్కున అతికే జాతీయాలు, పద్యాలలో పొదగడం నరసయ్యగారి సొత్తు. అచ్చ తెలుగు నుడికారానికి ఈయనభాష ఆలవాలం. ఈరెండు పద్యాలలోనూ కవిబ్రహ్మ కవిత్వంలోని జాతీయాలు, నానుడులు కానవస్తాయి.
“రివ్వునమ్రోసెబాణము హరీయని కెవ్వున కేక విన్పడెన్/
సవ్వడిమున్నుగామెరుగు చాడ్పన నొండొకవ్యక్తి బాకునన్/
గ్రువ్వినతోడనే మెకము గుండెలు ప్రేవులు నొక్కరేవునన్/
గువ్వయి ఘామతిల్లబడె గోండ్రని గాండ్రని యార్చిపేర్చుచున్.”
.........                          ,,.....                    .....
“మొగముంద్రిప్పెడు రెప్పవాల్చెడు ప్రజల్ మూఢాత్ములై గొర్రె దా/
టున రాబానుమతిం దెగించిరిది విడ్డూరమ్ముగాదోప బో/
దుగదే! మాదృశుల్న్ని బల్పదనమాదుమ్మెత్తి పోయింతురా/
పగసాధింతుర పంతగింతుర వృధాబాధింతురా భూధవుల్.”
కవిబ్రహ్మ కవితాశిల్పాన్నిపలువురు ప్రసిద్ధ పండితకవులు, రచయితలు ప్రశంశించారు.
శ్రీ నాగలింగం వేంకటేశ్వర శాస్త్రిగారు ఇలా అన్నారు. “కవిబ్రహ్మ శైలి అతని మానసము వలనే ఉదాత్తము, గంభీరము. పద్యముల నడకయంతయును మదగంభీర, సమ్యగలంకృత సర్వాంగవిలాసయాన ప్రవృత్త గజరాజగమనసదృశము. కుంటుపడుటలేదు. విరుపు పొరుపులు లేవు. వ్యర్ధపదమ్ లసలేలేవు. అక్కడక్కడ సంస్కృతసమాస మాధురీసంకలిత మయ్యును, బంధమంతయును తెలుగుపలుకుల మురువుహరులనేవెల్లడింపచాలియున్నది. పద్యముల కూర్పంతయును ప్రాచీనశైలిలోకాక, నవ్యాతినవ్యముగా నడచినది.”
శుచి రుచి కలపాకము, పొంకమూ ప్రసన్న ప్రసారమైనశయ్య, జిగిబిగిగల గంభీరత వీరభారతమున గోచరించుచున్నది”అన్నారు శ్రీ జమ్ములమడక మాధవరామ శర్మగారు.
దర్శనాచార్య శ్రీ కొండూరి వీరరాఘవాచార్యులుగారు ఇలా అన్నారు. “కవిత్వమున నరసయ్యగారు అందెవేసినచేయి. పద్యరచన చేయునపుడు రసభావానుగుణముగా పదము లీయనకు దాస్యము చేయును. ఉభయ భాషల నప్రతిముడగు నీకవి అచ్చ తెనుంగున, సంస్కృతమున,  సంస్కృతాంధ్రముల బద్యముల వెలయించి సహృదయుల మెప్పింపవలతి. కవితాధార ఆకాశగంగ నేలకు తాకు వేగము, చెలువమును గలది. కవితాశిల్ప రహస్యములను, అలంకారికమార్గములను నెరింగిన యీ విద్వత్కవి తన కవితను హృద్యముగను, మరి యనపద్యముగ, జేసికొనుటలో వింతలేదు,”
“నరసయ్యగారు విశిష్టకవి. భాషాపాండిత్యం కవితాహృదయం సమపాళ్ళుగా పొదుపజూపిన పండితకవి, కవిపండితుడు. భావమును మించి శైలియును, భాసురశైలినిమించు భావమును కలిగినవాడు. అతనొక కావ్యతపస్వి. చేతికివచ్చినదల్లా వ్రాయక, ఒకనియమమూ, ఒక భావమూ, ఒక ప్రణాళికా కలిగినవాడు. ఒక్కొక్క కృతిని ఒక్కొక్కరీతిని నిగళ సూత్రంగా చిత్రించి వేలార్చినాడు;; అన్నారు శ్రీ ఆవుల గోపాలకృష్ణమూర్తిగారు.
శతావధాని, కవిరాజు విప్లవకవి శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరిగారు నరసయ్యగారి కవితాశైలిని గూర్చి మగువమాంచాల తొలిపలుకులో “ఈ కావ్యము సూతాశ్రమమందలి లేమావిగున్న జంపు సొంపు చివుళ్ళు మెసవి పోసరించిన గండుకోయిల తేనెసోనలుచిందు కమ్మనిపాట” అన్నారు.
“తెలుగుపొలమ్ము నేటికొకతెన్నున దున్నన దివ్యకావ్య కృద్ధని/
కులులేరు పాపటములైన వివేవిలికైన వెల్ల నీ/
కలమును నాగటందునిన గాలిబయళ్ళునుగూడ సత్కవీం/
ద్రులు పయనించుచుందురటు త్రోవల గన్నులు గోరగింపగన్.”
                                  - శ్రీ రామకృష్ణకవులు
“ఓ కవిబ్రహ్మ! నీదుకలమోయి మరెన్ని
                               యుగాలనుండి భూ/
లోకముపైన జక్కని తెలుంగు మెరుంగులు
                               దిద్ది తీర్చెనో/
నీకు వయస్సుమగ్గినను నిగ్గులునొల్కు త్వదీయకావ్యల/
క్ష్మీకురులందు నీననలు మేలివిమానగకంటె మెత్తనై.”- శ్రీ వేదాంతకవి.

“తీయని భావముల్ వెలికిదీయుకొలందిని పొంగివచ్చు జా/
తీయము దూచివేయగలతీరు, చమత్కృతి, నీకలానకున్/
జేయనిసొమ్ములో సుకవిశేఖర! కర్ణపుటాల నిండుగా
పాయసమట్లు నీకవిత పారణచేయ గుతూహలంబగున్.”
   - శ్రీ ఉండేలమాల కొండారెడ్డి

““కమ్మని జానుతెన్గు నుడికారము లేరిచి కూర్చి పద్యగ/
ద్యమ్ములనల్లి కావ్యములయారెసృజించెడు నీకుసాటి లో/
కమ్మున నెంతమంది మొనగాండ్రు కవీంద్రులు గల్గిరయ్య స/
త్యమ్ముగ నేటుకూరి నరసయ్యకుమించి తెలుగుగడ్డపై.”
      -  శ్రీ కవిరావు

ఈవిధంగా మరెందరో కవులు కవిబ్రహ్మ రచనావైశిష్ట్యాన్ని ప్రశంసించారు. కవిబ్రహ్మ రచనలు నవ్యాంధ్రసాహిత్య సరస్వతికి నూతనాలంకారాలు. సారస్వత క్షేత్రంలో అడుగిడిన ప్రతి తెనుగుబిడ్డాచూచి, మురిసిపోగల పసిడిపంట భవ్యాంధ్రజాతికి గర్వకారణం.
తన కలమే హలంగా తెలుగు సాహితీ క్షేత్రంలో రసవత్కవితా కేదారాలు పండించిన కవిహాలికుడు శ్రీ నరసయ్య గారు. తన ప్రచండ కవితాదీధితులతో సాహిత్యాకాశాన్ని జేగీయమానంగా ప్రకాశింపజేసిన ఏటుకూరి నరసయ్యగారు యావదాంధ్రులకు చిరస్మరణీయులు.

(“సాహితీవల్లభ” ‘ఆంధ్రభోజ” శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజుగారి అభినందన సంపుటి- సాహితీ వాల్లభ్యము - రెండవ భాగము నుండి)

అశ్రద్దకు గురైన తెలుగు సాహిత్య పంట ఏటుకూరి వెంకటనరసయ్య

ఏటుకూరి వెంకటనరసయ్య


అశ్రద్దకు గురైన తెలుగు సాహిత్య పంట

క్సేత్రలక్ష్మి కావ్యం తో ఆకట్టుకున్న ఏ టుకూరి వెంకటనరసయ్య (1 ఏప్రిల్ 1911-10 నవంబర్ 194 తెలుగు మాస్తారుగా గురిజాల, నిదుబ్రొలులో పనిచేస్తూ కావ్యాలు రాసారు .

5 భాగాలుగా పలనాటి వీరచరితము రాసారు.అవి అలుగురాజు ,నాయకురాలు, అలరాజు, మాంచాల .

మిగిలినవి: నీతిమంజరి ,రైతు హరికధ, సిద్దాస్రమము,ప్రేమాలొకం, అంగద రాయభారము( లభించుటలేదు.

చందమమ మాస పత్రిక ఈయన నీతి వాక్యాలు ప్రచురించినది .గో వాడలో జరిగిన సాహిత్య పోటీలో రైతుహరికథ ఎంపిక కాగా కవిబ్రహ్మ అని బిరుదు ఇచ్చారు.

1955 లో ఎ.సి.కాలేజిలో వి వి ఎల్ నరసిం హారావు చే కవిబ్రహ్మ సాహిత్యంపై నేను(నరిశెట్టి ఇన్నయ్య) ఉపన్యాసము ఏర్పాటు చెయగా పూర్తి పాఠాన్ని ఆంధ్ర పత్రికలో ప్రచురించారు.

No comments:

Post a Comment