Monday, April 4, 2011

వడ్లమూడి గోపాల కృష్ణయ్య

వాజ్ఞ్మయ మహాధ్యక్ష వడ్లమూడి

"గీత గోవిందం", "గీత శంకరం", జయదేవ కృతుల వంటి సంస్క­ృత కావ్యాలను తెలుగు భాషలోకి అనువదించడం అత్యంత సాహసోపేతమైనదని ఎందరెందరో సాహితీవేత్తలు భావిస్తున్న తరుణంలో ఆ ఉత్క­ృష్టమైన కార్యాన్ని సమర్థంగా పూర్తి చేసి తెలుగు సాహితీ ప్రియులను మంత్రముగ్ధులను చేసిన వాజ్ఞ్మయ మహాధ్యక్ష బిరుదాంకితుడు, కళా ప్రపూర్ణ డాక్టర్‌ వడ్లమూడి గోపాల కృష్ణయ్య.

"ఋగ్వేదాలోకనమున దిగ్విలసిత కాలమూల దీప్తులు కల్గున్‌ ! ఋగ్వేద దివ్య దృష్టిని దిగ్విలసన కాల రహిత దీప్తుల్‌ వెల్గున్‌ !!" అని ఋగ్వేద సారాన్ని నాలుగు పాదాల సీస పద్యంలో చెప్పిన వడ్లమూడి తెలుగు సాహితీరంగానికి ఎనలేని సేవ చేశారనడంలో సందేహం లేదు.

సంస్క­ృతాంధ్రాల్లో భాషా ప్రవీణులైన డాక్టర్‌ వడ్లమూడి రెండో జయంతి ఈ నెల ఏడవ తేదీన.  ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకోవడం సముచితంగా వుంటుంది.

కృష్ణా జిల్లాలోని కౌతరం గ్రామంలో పందొమ్మిది వందల ఇరవై ఎనిమిది అక్టోబర్‌ ఇరవై నాలుగవ తేదీన వడ్లమూడి రంగారావు, సరస్వతమ్మ అనే పుణ్యదంపతులకు గోపాలకృష్ణయ్య జన్మించారు. సంస్క­ృత భాషలో పందొమ్మిది వందల యాభైలో "భాషా ప్రవీణ''లో ఉత్తీర్ణులయ్యారు. చదివిన చదువును సార్థకం చేసుకోవడానికి తెలుగు, సంస్క­ృత భాషల్లో ఆయన లోతైన, విస్త­ృతమైన పరిశోధనలు చేసి, తనదైన శైలిలో జనరంజకంగా రచనలు చేయడంలో దిట్ట అయ్యారు. తత్ఫలితంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు పందొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సంస్క­ృతాంధ్రాలు, ఖగోళ శాస్త్రం, జ్యోతిష వాస్తు శాస్త్రాలు, శిల్ప నాట్య శాస్త్రాలు, వేదాలు, జర్నలిజం, ఛందస్సలంకార శాస్త్రాలు, ఆయుర్వేద మంత్ర తదితర ఇరవై నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆయనకు గౌరవ కళాప్రపూర్ణ పట్టాన్నిచ్చి సత్కరించింది.

వడ్లమూడివారి తొలి రచన 'గాంధీ శతకం'. ఆయన నిత్యం ఖద్దరు దుస్తులు ధరిస్తూ తమ జీవితాంతం గాంధేయవాదిగా స్వచ్ఛమైన మనుగడ సాగించారు. స్వాతంత్య్ర సమరంలో కూడా పాల్గొన్నారు. అయితే స్వాతంత్య్ర సమరయోధుల పింఛనుకు మాత్రం నోచుకోలేదు. మరి ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చొరవ తీసుకొని స్వాతంత్య్ర సమరయోధుల ఫ్యామిలీ పెన్షన్‌ మంజూరు చేస్తుందేమో చూడాలి.

గోపాలకృష్ణయ్యగారి రెండో రచన 'మానవుడు' పద్యకావ్యం. ఆ తర్వాత జయదేవకృతి, ప్రజా నీతి గేయాలు, తీరని రుణం, రాజహంస (నాటికలు), అమ్మ పిల్లలు నవల వంటి అద్భుతమైన రచనలు చేసి సాహితీ రంగంలో తనదైన ముద్రను వేశారు. ప్రాచీన వాజ్ఞ్మయంలో వ్యావహారిక భాష లేక ధ్వని - లిపి - పరిణామం అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని రాశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక మంది భాషావేత్తలు దీన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుసరిస్తూ భాషా శాస్త్ర వ్యాసాలు రాస్తుండడం గమనార్హం. ఇక వ్యావహారిక భాషా వ్యాకరణం రచించారు. ఈ సందర్భంగా గిడుగు రామమూర్తిపంతులు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు గార్ల నేతృత్వంలో పందొమ్మిది వందల యాభై నాలుగులో అఖిలాంధ్ర కవిజనుల సమక్షంలో వడ్లమూడివారికి 'వాజ్ఞ్మయ మహాధ్యక్ష' బిరుదునిచ్చి ఘనంగా సన్మానించారు.

వీరు బాల న్యాయదర్శనం, జాను తెనుగు, మార్గ - దేశి, ఆరవీటి వంశ చరిత్ర (తెలుగు, ఆంగ్ల భాషలలో) వేదాస్‌ - క్రియేషన్‌ ( ఆంగ్లం), గ్రంథాలు రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానంవారు అయిదు సంపుటాలుగా తెలుగులో ప్రచురించిన "సమూల శ్రీ మదాంధ్ర ఋగ్వేద సంహిత'' గ్రంథ రచనకు వడ్లమూడి గోపాలకృష్ణయ్య సంకలన- పరిష్కరణ - లుప్త భాగపూరణ కర్తగా వ్యవహరించారు. ఈ ఋగ్వేదాన్ని తొలుత కావ్యతీర్థ నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు కొంత మేరకు ఆంధ్రీకరించి పరమపదించారు. వడ్లమూడివారి స్వీయ రచనల్లో అచ్చుకు నోచుకోనివి - 'మహాయోగం', 'కృష్ణ శతశతి' (పదివేలకు పైగా పద్యాలు), 'మనిషి - మహిర్షి', ' ఆయుర్వేదం' తదితర రచనలున్నాయి. అంతేకాక అనేక ఇతర పుస్తకాలకు నిగూఢమైన విషయాలతో కూడిన తొలి పలుకులు, పీఠికలు వడ్లమూడివారి అసాధారణ ధారణ శక్తికీ, బహుముఖ ప్రజ్ఞకూ గీటురాళ్లుగా నిలుస్తాయి.

వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు గుంటూరు జిల్లాలోని పొన్నూరు సంస్క­ృత కళాశాలలో తెలుగు ప్రధానోపన్యాసకులుగా, కృష్ణా జిల్లా విజయవాడలోని ఓరియంటల్‌ కాలేజీకి వైస్‌ ప్రిన్సిపాల్‌గా, ప్రిన్సిపాల్‌గా పని చేశారు. అలాగే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ' ఆరాధన' మాస పత్రిక సంపాదకులుగా, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖవారి ' ఆంధ్రప్రదేశ్‌' మాస పత్రిక ఎడిటర్‌గా, ఆకాశవాణిలో స్పోకెన్‌ వర్డ్‌స్‌ ప్రొడ్యూసర్‌గా, స్టేట్‌ ఆర్వ్య్‌వ్స్‌లో జాయింట్‌ డైరెక్టర్‌గా, హైదరాబాద్‌ తార్నాకలోని ప్రాచ్య లిఖిత భాండాగారం పరిశోధనాలయం వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఉన్నత పదవీ బాధ్యతలను ఆయన ఎంతో శ్రద్ధాభక్తులతో నిర్వహించి ఆయా విభాగాలకు జాతీయ స్థాయిలో వన్నె తెచ్చారు.

పందొమ్మిది వందల యాభై ఒకటి నుంచి డెబ్బై తొమ్మిది వరకు తమ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ పాలకులు డాక్టర్‌ వడ్లమూడి వాడినీ, వేడినీ వాడుకున్నారే గానీ వారి ప్రభుత్వ సర్వీసును రెగ్యులరైజ్‌ చేయలేదు. ఆ కారణంగా వడ్లమూడి అనంతరం వారి కుటుంబం ఇప్పుడు క్లిష్టమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది.

ప్రాచ్య లిఖిత భాండాగారం పరిశోధనాలయంలో డాక్టర్‌ వడ్లమూడి గోపాలకృష్ణయ్య డైరెక్టర్‌ వడ్లమూడి గోపాలకృష్ణయ్య డైరెక్టర్‌గా వ్యవహరించని సందర్భంగా ఆయన "సామవేద విశ్వ రూప ప్రదర్శన" గ్రంథాన్ని తెలుగులో రచించి ముద్రించడం జరిగింది. కానీ ఆ గ్రంథం బైండింగ్‌ దశలోనే టెక్ట్స్‌ బుక్‌ ప్రెస్‌లో గత రెండు దశాబ్దాలుగా మూలన పడి మూలుగుతోంది. ఈ ఆరుదైన గ్రంథరాజాన్ని తెలుగువారికి అందించాలనే వడ్లమూడివారి తపన తీరని కలగానే మిగిలిపోయింది.

తెలుగు సాహితీ రంగంలో బహుముఖ ప్రజ్ఞతో అలరారిన డాక్టర్‌ వడ్లమూడి గోపాలకృష్ణయ్య ఎన్నో క్లిష్టమైన రచనలు చేసి, గాంధేయ వాదిగా సాదాసీదాగా బతుకుతూ కనిపించిన ప్రతి ఒక్కరితో శ్రేయోభిలాషిగా సహకరించి ప్రోత్సహించచేవారు. అంతేకాక డాక్టర్‌ వడ్లమూడి గోపాలకృష్ణయ్య దాంపత్య జీవితంలోనే కాక సాహితీపథంలోనూ ఆయన సతీమణి శ్రీమతి శశికళగారి కృషి కూడా అసాధారణమైనది.

  (ThatsTelugu.com - Homage to Vadlamudi Gopalakrishnaiah ).



No comments:

Post a Comment