Monday, April 4, 2011

ఆచార్య చేకూరి రామారావుచేకూరి రామారావు

 తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకుడుగా పరిచయమైన చేకూరి రామారావు, ప్రధానంగా శిక్షణ పొంది - మౌలిక పరిశోధన చేసింది భాషాశాస్త్రంలో. ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నామ్ చామ్‌స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యుడయ్యాడు. ఆయన అమెరికాలోని కోర్నెల్ యూనివర్సిటీ నుండి ఎం. ఏ., పి.హెచ్.డి. డిగ్రీలు పొందాడు. ఆంధ్రజ్యోతి ఆదివారంలో చేరాతలు అన్న శీర్షిక నిర్వహించడం ద్వారా తెలుగు సాహిత్య విమర్శరంగంలోకి సుడిగాలిలా దూసుకువచ్చి, సంచలనం సృష్టించాడు - ఒక కొత్త విమర్శ ధోరణిని ప్రవేశ పెట్టాడు. ఈయన రాసిన స్మృతికిణాంకమనే వ్యాససంపుటికి 2002లో భారత ప్రభుత్వము కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును బహూకరించింది.

ప్రసిద్ధ రచనలు

తెలుగు పుస్తకాలు

 1. 1975 తెలుగు వాక్యం
 2. 1978 వచన పద్యం: లక్షణ చర్చ
 3. 1982 రెండు పదుల పైన
 4. 1982 తెలుగులో వెలుగులు (భాషా పరిశోధన వ్యాసాలు)
 5. 1991 చేరాతలు సాహిత్య విమర్శ - పరామర్శ
 6. 1994 చేరా పీఠికలు
 7. 1997 ముత్యాల సరాల ముచ్చట్లు
 8. 1998 ఇంగ్లీష్ తెలుగు పత్రికాపదకోశం
 9. 2000 స్మృతికిణాంకం
 10. 2000 భాషానువర్తనం
 11. 2001 భాషాంతరంగం
 12. 2001 సాహిత్య వ్యాస రింఛోళి
 13. 2001 కవిత్వానుభవం
 14. 2002 వచన రచన తత్త్వాన్వేషణ
 15. 2002 సాహిత్య కిర్మీరం
 16. 2003 భాషా పరివేషం
Chekuri Rama Rao : Chekuri Rama Rao was born on October, 1 1934 in illindalapadu village near Madhira, Khamma District. Is currently Prof Emeritus,and UGC-fellow.He is a renowned Literary Critic.Given below are a few passages from his views expressed on the state of Telugu Classical Literature: "The utter neglect of one's own ancient culture, and more glaringly, of one's own classical literature, is rampant amongst the Telugu-speaking people." "Speak to any of the recent breed of 'modern' poets- they are incapable of appreciating the nuances of a poem, its rhythm, its rhyme and alliteration. They cannot diferenciate between meters in a poem -geeta-padyam or kanda-padyam. Of course, it is not a crime, if one is unaware of such literary nuances or intricacies. However , to think that there is no need for learning those nuances and technicalities is certainly , gross rudeness and a case of bad-judgement." "The radicals and progressives have failed to recognise that it is possible to keep alive classical literature , while opposing the decadent values they stood for, by appreciating that the belief-systems espoused by the classical literature are not absolute truths but mere fantasy- creations of the human mind." "Imperialism - Colonialism are the opiates that have drowned our belief-systems.They would not spare any culture or values. Let us hence salvage what ever good is left of our ancient culture." "Classical literature is the priceless gift of our forefathers.That wealth can be put to good use even in this day and time to serve us.Discarding Classical literature as being of no use to us reflects our own worthlessness and utter incapacity and incapability to make use of it. " Some of his well known works are "A Gramatical Sketch of Telugu", "Rendu padula paina", "Cheratalu", "Telugulo velugulu" etc...


భాష్యకారుడు (సంపాదకీయం)

Andhra jyothi

Published at: 26-07-2014 01:15 AM
చేరా వెళ్లిపోయారు. భాషా శాసా్త్రనికి, సాహిత్య విమర్శకు ఎనలేని సేవ చేసి తెలుగు సమాజపు బౌద్ధికరంగంలో ముఖ్య పాత్ర నిర్వహించిన చేకూరి రామారావు నిరాడంబరమైన జీవితం గడిపి నిష్క్రమించారు. ఆయనతో పోలిస్తే అంగుష్ఠమాత్రులుగా ఉన్నవారు కూడా అందలాలు ఎక్కినా ఆయనను పదవులూ హోదాలూ పలకరించలేదు. ఆయనా అందుకు తాపత్రయపడలేదు. కేవలం అక్షరాలా అక్షరాల మనిషిగా జీవించారు. ఆధునికత, ప్రగతిశీలత, సంయమనం, అపారమైన పాండిత్యం, గాఢమైన కవిత్వ ప్రేమ- ఇన్ని లక్షణాలు ఒకచోట చేరితే చేరా. ఎనభై ఏళ్ల వయస్సులో చేరా మరణం కాలధర్మమే కావచ్చును కానీ, ఆయన అక్షరం ఇంకా సాహిత్య ప్రపంచపు జ్ఞాపకంలో తాజాగానే ఉన్నది. చేరా మరణవార్త అందుకే దిగ్ర్భాంతిని, తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తున్నది.
భాషా శాస్త్రం ఆయన అధికారిక అధ్యయన రంగం. సాహిత్యం ఆయన అభిరుచి రంగం. భాషాశాస్త్ర పరిశోధనలో కొత్త దారి తొక్కి, తెలుగు వాక్య నిర్మాణ రహస్యాలను ఆయన ఆవిష్కరించారు. అమెరికాలోని కోర్మెల్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పరిశోధన చేసిన రామారావు నోమ్‌ చామ్‌స్కీ సుప్రసిద్ధ ‘ట్రాన్స్‌ఫర్మేషనల్‌ గ్రామర్‌ సిద్ధాంత’ పరికరాలను తెలుగు వాక్యానికి అన్వయించి విశ్లేషించారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించిన ఆయన పుస్తకం ‘తెలుగువాక్యం’ తెలుగు వాక్యానికి నవీన వ్యాకరణం వంటిది. దురదృష్టవశాత్తూ, చేరా భాషాశాస్త్ర ఆవిష్కరణలను కానీ, భాషా సంబంధి రచనలను కానీ తెలుగు సమాజం ప్రయోజనవంతంగా వినియోగించు కోలేకపోయింది. ఒకరిద్దరు తప్ప, ఆ రంగంలో ఆయనతో సంభాషించిన వారు కానీ, ప్రధాన స్రవంతి చర్చలలోకి ఆ అంశాలను తీసుకువచ్చినవారు కానీ లేకపోయారు.
ఆధునిక తెలుగువాక్యాన్ని చేరా వ్యవహర్తల సంభాషణల నుంచి, ప్రసిద్ధ వచన రచనల నుంచి నమూనాలుగా తీసుకుని విశ్లేషణలు, వ్యాఖ్యలు చేశారు. రాసే తెలుగుకి, మాట్లాడే తెలుగుకి అంతరం ఉండి తీరుతుందని, రాసే భాష ప్రయోజనాలు భిన్నమయినవని, బౌద్ధిక వచనం సూటిగా అలంకార రహితంగా ఉండాలని ఆయన వాదించేవారు. నిర్విచక్షణగా ఆలంకారిక వచనం కానీ, కవిత్వ వచనం కానీ ఉపయోగించకూడదని చెప్పేవారు. చేరా వచనశైలి శాస్త్ర వచనానికి ఉదాహరణ ప్రాయంగా ఉండేది. వాక్యనిర్మాణానికి సంబంధించి తన శాసీ్త్రయ సూత్రాలనే చేరా వచన కవిత్వ విశ్లేషణకు కూడా వినియోగించుకున్నారు.
తెలుగు సాహిత్య ప్రపంచంతో నిత్యసంబంధంలో ఉన్నప్పటికీ, చేకూరి రామారావుకు విస్తృతమైన ప్రసిద్ధిని అందించింది ఆయన ‘చేరాతలు’ కాలమ్‌. అంతకు ముందే నగ్నముని ‘కొయ్యగుర్రం’ దీర్ఘకవితను ‘ఆధునిక మహాకావ్యం’ అని చేరా అభివర్ణించడంపై పెద్ద చర్చ జరిగింది. 1986 నుంచి 1994 దాకా ఎనిమిదేళ్ల పాటు ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ఆయన నిర్వహించిన ‘చేరాతలు’ కాలమ్‌ నాటి సాహిత్యలోకంలో ఒక సంచలనం. ప్రధా నంగా సమకాలిక కవిత్వ విశ్లేషణగా సాగిన ఆ కాలమ్‌, కొత్తగా రాస్తున్న కవులకు ప్రోత్సాహ కరంగా ఉండేది. రూపరీత్యా కవిత్వ నిర్మాణ పద్ధతిని వ్యాఖ్యానిస్తూ చేరా రాసిన వ్యాసాలు, అప్పటికి తెలుగు సమాజానికి అలవాటైన వస్తు విమర్శకు పూర్తి భిన్నమైనది. చేరా ప్రగతిశీల అభిప్రాయాలు కలవారని, ప్రజావ్యతిరేక కావ్యవస్తువును సమ్మతించేవారు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కానీ, కవితా నిర్మాణం మీద కేంద్రీకరించిన తీరు ఆయనకు ‘రూపవాది’ అన్న విమర్శను తెచ్చిపెట్టింది. వస్తువుతో ఏకీభావం ఉన్నప్పుడు, విమర్శించ వలసింది రూపాన్నే కదా- అని ఆయన సమాధానం. రాజకీయంగా, సాహిత్యోద్యమాల పరంగా కీలకమయిన కాలంలో చేరాతలు, పదునైన వ్యక్తీకరణ, మునుపటి కంటె భిన్నమయిన కవితానిర్మాణం చేయగలిగిన కవి తరాన్ని, తరాల్ని ఆవిష్కరించడానికి దోహదం చేశాయి. కవిత్వం రాయడానికే కాదు, కవిత్వాన్ని ఆనందించడానికి కూడా కొంత శిక్షణ, సహాయమూ కావాలని చేరాతలు నిరూపించాయి. తొలి అడుగులు వేస్తున్న కవులకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు, వారి కవిత్వాన్ని అర్థం చేసుకోగలిగిన పాఠకులను కూడా అవి రూపొందించాయి.
చేరాతలు కాలమ్‌ చేరాకు ప్రఖ్యాతితో పాటు, అనేక సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. ఆయన కాలమ్‌లో కనిపించిన కవులకు సాహిత్యరంగంలో ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో, చేరా ఎంపికపై విమర్శలు వచ్చాయి. తన నిర్మాణ సూత్రాలను అన్వయించి వ్యాఖ్యానించడానికి అనువైన పాఠ్యాలు కావడం వల్లనేమో, చేరా సీ్త్రవాద కవిత్వానికి పెద్ద పీట వేశారు. వస్తువు మంచిచెడ్డల జోలికి పోకపోయినా, ఆయన చేసిన రూపవిమర్శ కూడా ఆ ధోరణి కవిత్వానికి ఆసరాగా నిలిచింది. విప్లవ, దళితవాద కవులను కూడా చేరా అప్పుడప్పుడు పరామర్శించారు. ఏ కోవలోకీ చేరకుండా ఉన్న కవులను కూడా ఆయన వారి వ్యక్తీకరణ బలాబలాల ప్రాతిపదికన తరచు కాలమ్‌లో పరామర్శించారు.
చేరా ఆసక్తులు ఆధునిక వచన కవిత్వానికి మాత్రమే పరిమితమైనవి కావు. చిన్ననాడు స్వయంగా కవి అయిన చేరా, కవిత్వం మీద గాఢమైన అభిమానంతో తన సర్వశక్తులను కవిత్వ విమర్శ మీద కేంద్రీకరించారు. భాషాశాస్త్రంతో పాటు, ఛందస్సు కూడా చేరాకు ఇష్టమ యిన రంగం. ముత్యాల సరం మీద, వచనపద్యం లక్షణాల మీద సుదీర్ఘమైన చర్చలు చేశా రు. పత్రికలకు పనికివచ్చే ‘ఇంగ్లీషు-తెలుగు పత్రికా పదకోశం’ కూడా ఆయన నిర్మించారు. నేటి సమాచార సాధనాల్లో ఉపయోగించే తెలుగుని ఆయన  నిశితంగా పరిశీలించేవారు.
2003 దాకా పదహారు పుస్తకాలు (అధికం సాహిత్య విమర్శే) ప్రచురించిన చేరాను ఖమ్మం సాహితీమిత్రులు (సాహితీ స్రవంతి) 2004లో ఆయన 70వ జన్మదినం సందర్భంగా ఘనంగా సన్మానించారు. దీర్ఘకాలం తెలుగు భాషా సాహిత్య వేదికల మీద వెలిగిన చేరా, పదేళ్ల నుంచి తెరచాటుకు వెళ్లిపోయారు. అనారోగ్యం ఆవరించిన మాట నిజమే కానీ, ఆయన బహిరంగ జీవిత నిష్క్రమణకు అదొక్కటే కారణం కాదు. కవిత్వపు సరిహద్దులు విస్తరింపజేసినందుకు తన కృషి మీద ఆయన సంతృప్తిగానే ఉన్నారు. కానీ ‘చేరాతల’కు లభించిన కొన్ని ప్రతిస్పందనలపై ఆయన నొచ్చుకున్నారు. శేష జీవితానికి ఒక కొత్త ప్రయోజనాన్ని, కొత్త సంకల్పాన్ని చెప్పుకుని నిశ్శబ్దంలోకి జారిపోయారు. కవిత్వంతో తన రొమాన్స్‌ ముగిసిందని, అది దారితప్పిన ప్రయాణమని, భాషా వ్యాకరణాల అధ్యయనంలో పూర్తికాలం వెచ్చించాలనుకుంటున్నానని పదేళ్ల కిందట చేరా బహిరంగ ప్రకటనే చేశారు. ఆ కృషి ఎంత వరకు సాగిందో ఇంకా తెలియవలసి ఉన్నది.

మన చేరా మాస్టారు - ఓల్గా

Published at: 26-07-2014 01:11 AM(Andhra jyothi)
తెలుగు రచయితలందరికీ చేరా  గారితో తమవైన ప్రత్యేకమైన       అనుభవాలు ఉండి ఉంటాయి.  ఆయన నిత్య జీవితంలో స్నేహితులతో ఎంతో ప్రజాస్వామికంగా వ్యవహరించేవారు. అది ఇంకొకరికి సాధ్యం కాదు. అరుదైన వ్యక్తులు వెళ్ళిపోతుంటే జాతికి కలిగేలోటు తీర్చలేనిది.
గత శతాబ్ది చివరి రెండు దశాబ్దాలు (1980లు, 1990లు) సీ్త్రవాద సాహిత్య వికాస దశాబ్దాలు. ఆ వికాసంలో ప్రధాన పాత్ర చేకూరి రామారావు గారిది. సీ్త్రవాద కవిత్వాన్ని అర్థం చేసుకో నిరాకరిస్తున్న అనేక మంది కవుల, మేధావుల, విప్లవకారుల ఆలోచనలను సరియైున దారిలో పెట్టడానికి ఆయన విమర్శలు ఉపయోగపడ్డాయి. కవయిత్రుల కవిత్వం అచ్చవగానే ఆ తాజాదనాన్నీ, వస్తు శిల్పాల కొత్తదనాన్నీ ‘చేరాతలు’ రాసి సాహిత్య ప్రేమికులకు పంచిపెట్టే వారు. రామారావు గారి చేరాతల చేయూత లేకుంటే ఆ దశాబ్దాల నడక సీ్త్రవాదులకు మరింత కష్టమై ఉండేది. ఆ రోజుల్లో కవిత్వం కథలు రాయటం మొదలుపెట్టిన కవయిత్రులందరికీ ఆప్తమిత్రుడు చేరా.
ఔను, ఆయన చాలా గొప్ప భాషా శాస్త్రవేత్త. భాషా శాస్త్రంలో ఆయనతో దీటుగా శాస్త్ర చర్చలు చేయగలవాళ్లు అతి తక్కువ మంది. సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన వారు. విశ్వవిద్యాలయ ఆచార్యుడు అందంగా, హుందాగా, ఎదుటివారి గౌరవాన్ని కమాండ్‌ చేయగలిగిన వ్యక్తి. కానీ నిష్కల్మషమైన మనసుతో, మాటతో, చిరునవ్వుతో అందరినీ స్నేహితులుగా చేసుకునేవారు. ఒకటి రెండు కవితలు రాసిన వాళ్లు కూడా వచ్చి ఆయనతో సమానస్థాయిలో కూర్చుని మాట్లాడగలిగిన వాతావరణాన్ని ఆయన కల్పించారు. ఆయనతో స్నేహం అంటే పోసుకోలు కబుర్లు కాదు. లేనిపోని ప్రగల్భాలు కాదు. అసూయలూ, ఆడిపోసుకోవడాలూ కాదు. నేర్చుకోవటం. కవిత్వాన్ని ఎలా చదవాలో, ఎలా ఆనందించాలో, ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకోవటం. తెలుగు వాక్యరీతుల సొగసుల్ని అర్థం చేసుకోవటం. తెలుగు వ్యాకరణమంటే భయం పోగొట్టుకోవటం. తెలుగు ఛందోరీతుల మీద మమకారం పెంచుకోవటం. ముత్యాల సరాన్ని ముద్దాడేటంతగా ప్రేమించటం. ఇవన్నీ నేను ఎంతో కొంత చేరా గారితో స్నేహంలో నేర్చుకోగలిగాను. నాలాగే ఎంతో మంది నేర్చుకుని ఉంటారు. అధ్యాపకుడిగా ఆయన బోధన నేను వినలేదు. కానీ ఒక సాహితీ మిత్రునిగా ఆయన నాకు ఎంతో బోధించారు. అలాగే సీ్త్రవాదం గురించి ఓపికగా ఎంతో విన్నారు. నేనిచ్చిన పుస్తకాలు చదివారు. దాదాపు నలభై సంవత్సరాల కాలంలో ఆయన మీద గౌరవం పెరుగుతూ వచ్చింది. చేరా గారితో స్నేహం చెయ్యటమంటే ఆయన కుటుంబంలో ఆప్తులుగా మారిపోవటమే. రంగనాయకి గారు, అమ్మాయి సంధ్య కూడా మమ్మల్ని ఎంతో స్నేహంగా చూసేవారు. ఆయన మనవడు హేమంత్‌ కూడా మాకు దగ్గరయ్యాడు.
వ్యక్తిగతంగా ఆయన నాకు చేసిన మేలు మర్చిపోలేనిది. నాకేదో అపకారం జరుగుతుందని ఒకరోజు సాయంత్రం యూనివర్సిటీ నుంచి జూబ్లీహిల్స్‌కు బస్సులో వచ్చి నాకు జాగ్రత్తలు చెప్పి, అసలు పరీక్షా సమయంలో పక్కనే పెద్ద అండగా ఉండి నాకు ధైర్యాన్నిచ్చారు. నాకూ, కుటుంబరావుకూ మర్చి పోలేని మహోపకారం ఆయాచితంగా చేశారు. ఆ తరువాత దాని గురించి ప్రస్తావనే లేదు. నేనింత సహాయం చేశాను అని పదే పదే గుర్తుచేసే చిన్న మనసు కాదాయనది. నిజంగా 1980వ దశకం చివరి సంవత్సరాలలో నాకు గొప్ప వ్యక్తుల, మేధావుల స్నేహం లభించింది. నేను ‘ఈనాడు’ ఆఫీసులో పనిచేస్తుండేదాన్ని. పక్కనే ఉన్న ఒక భవనంలో అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ తాత్కాలికంగా కొన్ని సంవత్సరాలు పనిచేసింది. అక్కడికి చేరా వచ్చేవారు. కేతు విశ్వనాథరెడ్డి గారు, చలసాని ప్రసాదరావు గారు, శివలింగప్రసాద్‌ గారు, నేనూ, కుటుంబరావు తరచూ అక్కడ కలిసేవాళ్ళం. అంబేద్కర్‌ యూనివర్సిటీ తెలుగు సిలబస్‌ గురించి చర్చలు నడిచేవి. సాహిత్య, సామాజిక, రాజకీయ విషయాల గురించిన చర్చలు జరిగేవి. రామారావు గారు రాసిన పాఠాలు నిజంగా మార్గదర్శకాలు. సావిత్రి గారి కవితను ఆయన వివరించి విశ్లేషించిన తీరు ఎంతో ఆధునిక మైనది. మాట్లాడటంలో, వివరించటంలో, స్నేహం చెయ్యటంలో, ఒక సంప్రదాయ ధోరణిని ఒదిలించుకోటానికి, కొత్త భావాలనూ, రీతులను అర్థం చేసుకోటానికీ రామారావు గారు కనిపించకుండా నాపై వేసిన ప్రభావం ఎంతో మాటల్లో చెప్పలేను.
1983లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ కోసం ఎగ్నెస్‌ స్మెడ్లీ కథలను ‘సామాన్యుల సాహసం’ పేరుతో అనువదించాను. అను వాదంలో అది నా తొలిప్రయత్నం. సంపాదకుడుగా చేరా ఉన్నారు. కథలు పంపిస్తే తప్పులుంటే ఆయన వ్యాఖ్యలు రాసి, సవరించి తిరిగి పంపించవచ్చు. కానీ ఆయన ఒక రాత్రంతా నిద్ర లేకుండా నేనా కథలు చదువుతుంటే విని వెంట వెంటనే స్పందించారు. నేను, గీత, కె.లలిత, కుటుంబరావు ఆ రోజు లలితా వాళ్ళింట్లో గడిపిన రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేను. రామారావు గారు ఇచ్చిన కొన్ని సలహాలు నాకు ఇవాళ్టి వరకూ ఎన్ని అనువాదాలో చేయగల శక్తినిచ్చాయి. సాహిత్యం, రాజకీయాలు, సాంఘిక శాస్త్ర విషయాలు- ఎంత క్లిష్టమైన వస్తువునైనా తేలికగా అనువాదం చేయగలుగుతున్నాను.
2002లో మా ఇద్దరికీ మహాభారతంలో విరాటపర్వం చదవాలనే కోరిక కలిగింది. కలిసి చదివితే ఇంకా ఎక్కువగా ఆస్వాదించవచ్చు ఆనందించవచ్చు అనుకున్నాం. రెండు నెలల పాటు రోజూ ఉదయం తొమ్మిది గంటలకు చేరా గారింటికి వెళ్ళేదాన్ని. ఆయన, హేమంత్‌ స్కూలుకి వెళ్ళాక తన పనులు ముగించుకుని ఉండేవారు. రెండు గంటల పాటు తిక్కన గారి కవిత్వపు రీతులలో, లోతులలో మునిగితేలేవాళ్ళం. తిక్కన వాడిన భాష గురించి ఎన్ని విశేషాలు చెప్పేవారో. నేను గమనించి చెప్పిన కవితా విశేషాలనూ ఆయన ఆనందించి నన్ను మెచ్చుకునేవారు. వేగుంట మోహన ప్రసాద్‌ గారి కవితలను అర్థం చేసుకోవటం నేర్పింది కూడా మాస్టారే. తెలుగు రచయితలందరికీ చేరా గారితో తమవైన ప్రత్యేకమైన అనుభవాలు ఉండి ఉంటాయి. ఆయన నిత్య జీవితంలో స్నేహితులతో ఎంతో ప్రజాస్వామికంగా వ్యవహరించేవారు. అది ఇంకొకరికి సాధ్యం కాదు. అరుదైన వ్యక్తులు వెళ్ళిపోతుంటే జాతికి కలిగేలోటు తీర్చలేనిది.
రెండు మూడు సంవత్సరాలుగా చేరాగారు మరింత పరధ్యానంగా, డిటాచ్‌డ్‌గా కనిపిస్తూ వచ్చారు. ఐతే ఆయన సాహిత్య ప్రపంచంతో తన సంబంధాన్ని మాత్రం ఒదులుకోలేదు. ప్రతి రోజూ నగరంలో జరిగే సభలకు హాజరయ్యేవారు. అందరినీ చూసేవారు. సభలో కాసేపు కూచుని వెళ్లిపోయేవారు. వేదిక మీద కూర్చుని విలువైన మాటలు మాట్లాడాల్సిన వ్యక్తి సభలో ఎక్కడో ఓ చోట నిశ్శబ్దంగా కూర్చుని వెళ్తున్నారే అని బాధ కలిగేది. కానీ ఆయన ఈ ప్రపంచంలో ఒక డిటాచ్‌మెంట్‌ని అభ్యాసం చేసి తను వెళ్ళిపోయే మార్గాన్ని సుగమం చేసుకున్నట్లున్నారు. ధ్యానంలో అనాయాసంగా ఈ ప్రపంచాన్ని దాటి అవతలి గట్టుకు చేరుకోగలగటం ఆయన జీవిత గమనం లాగానే గౌరవంగా హుందాగా జరిగిందనిపిస్తుంది.
- ఓల్గా
 చేరా లేరా నమ్మలేం. ఇంకా ఉండడి సార్..
        -ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి...
       ద్రావిడ విశ్వవిద్యాలయం 9440493604.
.
నిన్న చాలా పెద్ద పెద్ద విషాదాలు జరిగాయి. ఖమ్మంజిల్లా అంతర్జాతీయ మేధావి, మా గురువు గారు చేకూరి రామారావుగారు కాలంచేశారనే వార్తని నమ్మలేకపోతున్నాను. ఈ రోజున నేను హైదరాబాదుకు చాలా దూరంలో ఉండడం చాలా దురదృష్టం. ఆయన్ని చివరి చూపు చూడలేకపోయాననే బాధ నాకు జీవితాంతం ఉంటుంది. భారత దేశంలో ఆధునిక భాషాశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా నిలదొక్కుకోవడానికి ఇద్దరు తెలుగు వారే కారణం ఒకరు భద్రిరాజు కృష్ణమూర్తి మరొకరు చేకూరి రామారావు. నోమ్ చామ్ స్కీ ప్రభావంతో ఆయన భాషాశాస్త్ర పరిశోధన చేశారు. తెలుగు వాక్యంపైన పరిశోధన ఇలాగే జరిగింది. అంతే కాదు ఆయన రాసిన చాలా అంతర్జాతీయ పత్రాలు ఇప్పటికీ విశిష్టమైనవి. ఆంధ్రప్రదేశ్ లో నేడున్న మంచి భాషాశాస్త్రవేత్తలు ఆయన నుండి ప్రత్యక్షంగా పరోక్షంగా స్ఫూర్తిపొందినవారే.
నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో నన్ను బాగా అభిమానించి దగ్గరకు తీసారు చేరా బాగా ప్రోత్సహించారు. నేనీరోజున ఇలా ఉన్నత స్థానంలో ఉండడానికి ఒకరకంగా ఆయనే కారణం. తెలుగువిశ్వవిద్యాలయంలో ఆయన మొట్టమొదటి డీన్ గా చేరినప్పుడు (దొణప్పగారు ఆయన్ని ఆహ్వానించారు) 1986లో జానపదం పైన అంతర్జాతీయ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఇద్దరు అమెరికన్ ఆచార్యులు వచ్చి ఆధునిక జానపద శాస్త్రాన్ని బోధించారు. అదేస్ఫూర్తితో 1988లో ఒక సంవత్సరంపాటు దాదాపు పదిమంది అమెరికన్ ఆచార్యులతో జానపద శిక్షణ చేయించారు. దీని కారణంగానే అటు తెలుగు యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీలో తర్వాత ద్రావిడ యూనివర్సిటీలో జానపద శాఖలు ఏర్పడ్డాయి. దక్షిణ భారతదేశంలో సుమారు 120 మంది యువకులు అంతర్జాతీయ స్థాయి శిక్షణని జానపదంలో పొందారు. దీనికి ప్రముఖ కారణం చేరా గారే.
1983 ప్రాంతంనుండి ఆయన చేరాతలు ఆంధ్రజ్యోతిలో రాశారు. తెలుగులో సంప్రదాయ పద్ధతి సాహిత్య విమర్శ ఒక పెద్దమలుపు ఇక్కడే తిరిగింది. ఆధునిక వచన కవిత్వానికి ఆయన మంచి మలుపును ఇచ్చారు. ఆధునిక వచన కవితలో పాశ్చాత్య ప్రభావంతో వచ్చిన నిర్మాణ రీతులు ఎలా ఉన్నాయో చాలా ప్రతిభా వంతంగా విప్పిచెప్పారు. ఇలా చెప్పిన తర్వాత ఈ ప్రభావంతో చాలా మంది యువకులు కొత్త తరహా కవిత్వం రాశారు. కొత్త కవులకు స్ఫూర్తినిచ్చేలా సాగాయి ఆయన వ్యాసాలు. ఆనాడు ఖమ్మం ప్రాంతం నుండి వచ్చిన యువకవులు అఫ్సర్, ప్రసేన్, సీతారాం రక్తస్పర్శ కవులుగా నిలబడడానికి తర్వాతి యాకూబ్ మొదలైన వారికి ఆయనే స్ఫూర్తి మంచి ప్రోత్సాహకుడు. తెలుగులో స్త్రీవాద కవిత్వం ఒక ప్రత్యేక స్రోతస్సులో రాబోతున్నదని గ్రహించి దానికి మంచి వెన్నుదన్నుగా నిలిచారు. కొండేపూడి నిర్మల పాటిబండ్ల రజని మొదలైన వారు రచించిన కవిత్వంపైన ఇంకా ఇతర కవయిత్రుల రచలనపైన మంచి ప్రోత్సాహకమైన వ్యాసాలు రాశారు. స్త్రీ వాద కవిత్వానికి మంచి స్థితి గౌరవం కలగడానికి ఆయన వ్యాసాలూ తోడ్పడ్డాయి.
తెలుగు పరిశోధన తీరుపైన కూడా ఆయన మంచి వ్యాసాలు రాశారు. తెలుగు పరిశోధన ఉన్న దయనీయ స్థితిని గమనించి దాన్ని ఆరోగ్యంగా తయారు చేయడానికి మంచి విధానాలను చెప్పారు. నిరలంకారము సెంటిమెంట్లు లేని పొడి పొడి వచనాన్ని రాయడం పరిశోధనకు చాలా అవసరం అని. తెలుగు పరిశోధన పర్యవేక్షకుల స్థాయి కూడా బాగా పెరగాలని చెప్పారు. ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటీ వాయనం అనే ధోరణిలో పర్యవేక్షకులు వారి వారి విద్యార్థులకు అవార్డులు వచ్చేలాగా చేసుకుంటున్నారని ఇది చాలా చెడు అని మంచి ప్రమాణాలు ఏర్పడడానికి పర్యవేక్షకులు మారడం చాలా అవసరమని చెప్పారు.
తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలపైన వారికి చాలా మంచి లోతైన అవగాహన పట్టు ఉన్నాయి. ప్రాచీన సాహిత్యం గురించి ఆయన ఎంత లోతుగా విప్పి చెప్పగలరో కొద్దిమందికే తెలుసు. అలాగే సంప్రదాయ వ్యాకరణం పైన ఛందశ్శాస్త్రంపైన ఆయనకు లోతైన పరిజ్ఞానం పాండిత్యం ఉన్నాయి. భారతీయ ఛందశ్శాస్త్రం అలాగే పాణిని వ్యాకరణం ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి శాస్త్రాలని ఆయన అంటారు. ఛందస్సును దాని ప్రస్తారం గురించి చాలా వివరంగా చెబుతారు. చేరా వచన పద్యం లక్షణ చర్చ చేస్తూ భారతిలో రాసిన వ్యాసాలు అలాగే సంపత్కుమారతో చేసిన చర్చ అపురూపమైంది. ఆయన ఛందశ్శాస్త్ర పరిజ్ఞానాన్ని అక్కడ మనం చూడవచ్చు. సంపత్కుమారని, బండి నాగరాజు అనే ఆయన్ని మరొక పండితుడు ఛందస్సు మీద పనిచేసేవారిని బాగా మెచ్చుకునేవారు. అది చాలా గొప్ప శాస్త్రం దాన్ని నేర్చుకోవాలి అనేవారు. నేను అవధానాల చేయడం (అప్పట్లో) ఆశు పద్యరచన చేయడం చూచి నువ్వు బ్రాహ్మడివి కాదే బాగానే పద్యరచన వచ్చిందే అనేవారు అంతే కాదు నన్ను సుబ్బావధానీ అని సరదాగా పిలిచే వారు. అలా పిలిపించుకోవడం ఇష్టం ఉండేది కాదు. కాని ఆయన సాహచర్యాన్ని వదిలే వాడిని కాదు. సాహిత్య అకాడమీ ప్రాజెక్టు కింద దాదాపు రెండు సంత్సరాలు ఆయన పర్యవేక్షణలో పనిచేసే అదృష్టం కలిగింది. ఆయన ప్రతిరోజూ చేసిన మార్గదర్శనం నాకు జీవితంలో వృత్తిలో ఎంతో తోడ్పడింది.
చేరా మంచి హేతువాది వామపక్షభావాలున్నవారు అని అందరికీ తెలిసిందే. గమ్మత్తేమిటంటే ఈ లక్షణం అటు ఛామస్కీ నుండి వచ్చినదే. ఆయన ఇప్పటికీ అమెరికా లో ఫైర్ బ్రాండ్. అమెరికా ప్రభుత్వమూ ఆయన సిద్ధాంత విచక్షణకి భయపడుతుంది, గౌరవిస్తుంది. కూడా భాషాశాస్త్రజ్ఞులు చాలామంది ఇలా హేతువాదులుగా ఉండడం గమనించవచ్చు. ఈప్రభావం నామీద చాలా ఉంది. ఆయన హేతువాద గుణం సాహిత్య విమర్శలోను భాషావిశ్లేషణలోను కనిపిస్తుంది. నాదబ్రహ్మం శబ్ద బ్రహ్మం అనే మాటల్ని ఆయన అంగీకరించేవారు కాదు. భాషని దేవతలా చూస్తే మనం ఏమీ చేయలేం మంచి వ్యవస్థగా హేతుబద్ధంగా చూడాలి అనేవారు. నేను 1982నుండి 84 వరకు పేరడీ పద్యాలు రాసే రోజుల్లో ఆయన మీద రెండు పద్యాలు రాశాను. కింద ఉన్నాయి.
చేరాచేరాతలచే
వారాదిన్ జ్యోతి వెలుగు వాలాయముగన్
నారా తల నెప్పుడునో
స్త్రీ రాగము తిరుగుచుండు సిరిసిరిమువ్వా.
సిద్ధించే సీతాపతి
శుద్ధిని తాగోరును పరిశోధన లోన్
బుద్ధిగ వారిని డాసిన
సిద్ధాన్నము దొరికినట్లె సిరిసిరి మువ్వా..
ఈ కింది పద్యాన్ని ఆయన చాలా ఇష్ట పడ్డారు. కారణం చేకూరి రామారావు అనే మాటని సిద్ధించే సితాపతి అని సంస్కృతంలోనికి అనువాదం చేసి చమత్కారంగా పిలిచింది నాయని సుబ్బారావుగారు. నాయని సుబ్బారావుగారితో ఆయనకి చాలా దగ్గరి అనుబంధం ఉండేది. నాయని కృష్ణకుమారిగారు ఆయనకి స్వయంగా అక్కయ్యగా మెలిగారు వారు. ఎం.ఎ లింగ్విస్టిక్స్ చేయమని ప్రోత్సహించి ఆంధ్రా యూనివర్సిటీకి పంపింది కృష్ణక్కయ్యే అని చెప్పేవారు. ఆ అనుబంధం చివరిదాకా అలాగే సాగింది. నాయని సుబ్బారావు గారి సాహిత్యంపైన కూడా చాలా వివరంగా మాట్లాడేవారు వ్యాసాలు కూడా రాశారు. అక్కి రాజు ఉమాకాన్తమ్ గారి సాహిత్య విమర్శ కూడా చేరాకి బాగా నచ్చేది. నేటి కాలపు కవిత్వం పేరుతో భావకవిత్వంపైన ఆయన చేసిన విమర్శని బాగా మెచ్చే వారు.
అత్యంత సున్నితమనస్కుడైన చేరా తెలుగు కవుల మీద కొన్ని కటువైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది నచ్చని తెలుగు కవులు ఆయన్ని శత్రువుగా చూచిన మాట కూడా వాస్తవం. తనకు భిన్నమైన సిద్ధాంత ధోరణిలో ఎప్పుడూ రాసే ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం గారిని వ్యక్తిగతంగాచాలా ఆప్తుడైన మిత్రుడుగా సంభావించారు చేరా. ఆయన ఆత్మీయత మరువరానిది.
చేరా లేనిలోటు అటు భాషాశాస్త్రానికి ఇటు తెలుగు సాహిత్యానికి పూడ్చగలిగేది కాదు. వారి సూటితనాన్ని హేతుబద్ధ విచక్షణని అలవరచుకుంటే తెలుగుసాహిత్య విమర్శకులు సాహిత్యకారులు మంచి నివాళిని ఇవ్వగలిగినట్లే
     - పులికొండ సుబ్బాచారి.

విమర్శకుడు వచనకారుడు స్నేహితుడు - వెల్చేరు నారాయణ రావు

Andhra jyothi , Published at: 28-07-2014 
అతను భాషాశాస్త్రానికి సాహిత్యానుభవం నేర్పాడు, సాహిత్యవిమర్శకి భాషాశాస్త్ర తార్కికత నేర్పాడు. హడావిడి లేకుండా ఆర్భాటం లేకుండా  కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించగలగడం, గాఢమైన ఊహల్ని ప్రకటించగలగడం తెలుగుకి అలవాటు చేశాడు రామారావు.
అతను చేరా కాకముందునుంచీ, నేను నారాని అవకముందునించి-ఎప్పటినుంచో చెప్పలేను-చేకూరి రామారావు నాకు స్నేహితుడు. ఇద్దరమూ జీవితంలోనూ, సాహిత్యంలోనూ కలిసి నడిచాం. మొదట మేం ఎప్పుడు కలుసుకున్నమో కూడా చెప్పలేను. విశాఖపట్నంలో అనుకుంటాను, అతను భద్రిరాజు కృష్ణమూర్తి దగ్గర మాండలిక వృత్తిపదకోశం కోసం పనిచేస్తున్నాడు, ప్రేమ కవిత్వం రాస్తున్నాడు. పిఠాపురం హాష్టల్‌ దగ్గిర కూర్చుని గంటలకొద్దీ కబుర్లు చెప్పుకునేవాళ్ళం మేం ఇద్దరం.
నన్ను భాషాశాస్త్రంలోకి పట్టుకొచ్చింది చేరానే. మైసూరులో నాకు మొట్టమొదటి భాషాశాస్త్ర పాఠాలు చెప్పాడతను. ఆ తరువాత హైదరాబాదులో భాషాశాస్త్రంలో డిప్లొమా చేసినపుడు కూడా నాకు పాఠాలు చెప్పింది అతనే. ఆ రోజుల్లో నేను హైదరాబాదులో డిప్లొమా చేస్తూ వాల్తేరులో తెలుగు ఎమ్‌ఎ చదువుతూండేవాడిని.
పేరుకి నాకో గది తార్నాకలో వుండేది. కాని నేను వుండేది ఎప్పుడూ చేరా వాళ్ళ ఇంట్లోనే. రంగనాయకిగారు నన్ను కుటుంబంలో మనిషిలా ఆప్యాయంగా చూసుకునేవారు. నేను కిట్టూ అని పిలిచే క్రిస్టఫర్‌ అప్పుడు చాలా చిన్న పిల్లాడు. ఇప్పుడతను శాన్‌ఫ్రాన్సిస్కోలో హిస్టరీ ప్రొఫెసరు.
ఏవో పనులు, ఆలోచనలు, గందరగోళాల మధ్య, నేను హోటల్‌లో తిండి సరిగ్గా తినక విస్తట్లో అన్ని కెలికేసి, తిన్నట్లనిపించుకుని చెయ్యి కడుక్కుంటుంటే చూసి, దగ్గర కూచుని, ‘ఇదిగో ఈ కూర తినొచ్చు, ఈ పచ్చడి బాగుంటుంది’ అని చెప్తూ, సావకాశంగా తినేదాకా కబుర్లు చెప్తూ తను దగ్గిర కూచుని నాచేత మంచి భోజనం చేయించేవాడు చేరా.
తెలుగు సాహిత్యంలో విమర్శకుడుగా, భాషా శాస్త్రజ్ఞుడుగా, వాక్యవేత్తగా పాఠకుల ఆదరణ పొందాడు చేరా. అన్నింటికన్నా మించి కొత్త కవుల్ని, కవయిత్రుల్ని పనికట్టుకుని గుర్తించి, వాళ్ళ పుస్తకాలకి ముందు మాటలు రాసిన వాటికి గుర్తింపు తెచ్చాడు. పుస్తకం పుస్తకానికి చేరా ముందు మాటలు రాస్తూవుంటే నేను వేళాకోళంగా అనే వాణ్ణి కూడా: ‘ఇక్కడ ముందు మాటలు రాయబడును’ అని ఒక బోర్డు పెట్టుకోరాదూ- అని. ఆ పని ఇప్పుడు నేను చేస్తున్నట్లు వుంది.
తన చేరాతల ద్వారా ఎంతోమందిని కొత్తవాళ్ళని సహృదయపూర్వకమైన తన వచనంతో చక్కగా పరిచయం చేశాడు చేరా. తగాదాలు వచ్చినా హుందాగా వ్యవహరించాడు. సున్నితమైన హాస్యంతో, గొప్ప మనసుతో, మంచి అభిరుచి తప్ప మరేదానికి పెద్ద స్థానం యివ్వని సాహిత్య దృష్టితో అందరినీ కలుపుకుంటూనే అయినా తన దృక్పథంలో రాజీ పడని నిష్కర్షతో నిండు కుండ లాంటి పెద్ద మనిషి తరహాతో రామారావు తెలుగులో నిలిచిపోయే వచనం రాశాడు.
వివాదపడితే చేరాతోనే వివాదపడాలి. సంపత్కుమారతో వచన విషయంలో వాదించినా నాతో నగ్నముని కొయ్యగుర్రం గురించి విభేదించినా వాదన అంటే ఇలా వుండాలి అని అనిపించుకునే వాదన చేశాడు. అప్పట్లో వచ్చిన ‘చేరా-నారా సంవాదం’ గురించి ఇదేదో వెల్చేరు రామారావు, చేకూరి నారాయణరావు ఒకరితో ఒకరు వాదించుకున్నట్లుగా వుంది అనేవారు కూడాను.
వాదనల్లో, విమర్శలో ఆయన వాడే వాక్య నిర్మాణంలో ఆలోచనని సంయమనంతో నిబ్బరంగా ప్రకటించడంలో తెలుగుకి ఒక కొత్త ప్రమాణాన్ని యేర్పరిచాడు రామారావు. అతను భాషాశాస్త్రానికి సాహిత్యానుభవం నేర్పాడు, సాహిత్యవిమర్శకి భాషాశాస్త్ర తార్కికత నేర్పాడు. హడావిడి లేకుండా ఆర్భాటం లేకుండా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించగలగడం, గాఢమైన ఊహల్ని ప్రకటించగలగడం తెలుగుకి అలవాటు చేశాడు రామారావు. ఆ అలవాటుని కొనసాగించగలవాళ్ళు, ఆ పద్ధతుల్ని అనుసరించగలవాళ్ళు అతన్ని సహేతుకంగా కాదనగలవాళ్ళు తెలుగులో ఇప్పటికీ కనబడటం లేదు.
తమతో అంగీకరిస్తే సున్నితంగా నవ్వి ఊరుకునేవాళ్ళూ, తమతో విభేదిస్తే ఉత్సాహంతో వినేవాళ్ళు, నాకు తెలిసి తెలుగులో ఎక్కువమంది లేరు, ఆ చాలా కొద్దిమందిలో రామారావు ఒకడు.
నేను ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు కవిత్వాన్ని అనువదించి సంకలనం చేసే రోజుల్లో అతన్ని ప్రతిరోజు అమెరికానుంచి పిలిచేవాణ్ణి, నిద్ర ఇంకా పూర్తికాని తెల్లవారు ఝామున. నేనడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి, నేను అనువదిస్తున్న ప్రతి పద్యాన్ని గురించి తన దృక్పథంతో వివరంగా మాట్లాడి ఎన్ని కబుర్లు చెప్పేవాడే, తను ఇంకా మొదటి కాఫీ కూడా తాగలేదనే సంగతి కూడా మరిచిపోయి.
కంప్యూటరు వచ్చి ఉత్తరాల్ని రాయడాన్ని చంపేసింది కాని చేరా గొప్ప ఉత్తరాలు రాసేవాడు. ఆయన తన మిత్రులకి రాసిన ఉత్తరాలు దొరికినన్ని సంపాదించి వాటిని కలిపి ప్రచురిస్తే తెలుగు సాహిత్యంలో ‘ఉత్తరాయణం’ ఆయన చేతిలో ఎంత గొప్ప స్థాయికొచ్చిందో బోధ పడుతుంది.
తెలుగు సాహిత్యంలో ఒక తరం వెళ్ళిపోతోంది. ఆ తరంలో నా దగ్గర స్నేహితులు చాలా మంది వెళ్ళిపోయారు: శంకరమంచి సత్యం, ముక్తేవి లక్ష్మణరావు, సంపత్కుమారాచార్య, చలమాల ధర్మారావు, ఇప్పుడు చేరా.
వీళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళు. నేనింకా వుండడం ఈ దుఃఖాన్ని అనుభవించడానికి.
- వెల్చేరు నారాయణ రావు

ఆర్ద్రములు చేరా స్మృతులు - చలసాని ప్రసాద్‌

  Andhra jyothi ,Published at: 28-07-2014 
బుధవారం నాడే ఫోనులో పలకరించా. బాగున్నానన్నాడు. కాస్త తమాయించుకున్నా. ఇంతలోనే మీ చేరా పోయాడు అంటూ ఫోను. నిలవలేకపోయా. నిబ్బరం కోల్పోయా.
మా స్నేహానికి యాభై ఏళ్ళు పై బడ్డాయి. అతనొక కమ్యూనిస్టు అభిమాని. విరసం గాఢాభిమాని. విరసంలో లేడుగాని, విరసంతోనే ఉండేవాడు.నేను విరసం వ్యవస్థాపక అసభ్యుడుని అని అంటూండేవాడు. మేమిద్దరం పరస్పరం అయోమయం అని పిలుచుకునేవాళ్ళం. ‘మీ ఇద్దరినీ మరెవ్వరూ ఏమీ అనక్కరలేకుండా చక్కని పేర్లు పెట్టుకున్నారు అంటూ మా విజయ, వాళ్ళ రంగనాయకి హాయిగా నవ్వేవాళ్ళు. మేము ఉత్తరాలు చాలా రాసుకునే వాళ్ళం. ‘ప్రియమైన అయోమయం’ అనే బదులు ‘ప్రియోమయం’ అని వాడవచ్చా? అని అడిగా. ఎందుకు వాడకూడదు? వైద్యుడిని ‘మందువాడు’ అని మన తిక్కన పేర్కొన్నా డు అంటూ భాషమీద చాలాసేపు బోధ చేశాడు. కవితాలోలుడు. ఆధునిక తెలుగు కవిత్వం అంటే పంచప్రాణాలు. కవిని అతిగా పొగిడితే ఎవరయినా ఏద్దేవా చేసేవారు. అలాంటప్పుడు అలిగేవాడు. ‘కవిత్వం జోలి నాకేల? నేను భాషావాదిని’ అని తాత్కాలికంగా అస్త్ర సన్యాసం చేసేవాడు.
కవిత్వం అంటే చాలా చాలా ఇష్టం. కాని తన కృషి భాషా శాస్త్రంలో అని పదేపదే చెప్పేవాడు. ‘చేరాతలు’ సాహిత్యాభిమానులకి మంచి ఊతకర్ర. చక్కటి విమర్శకుడిగా అందరి కళ్ళల్లోనూ వెలుగుతాడు. విడవకుండా కాలమ్‌ రాశాడు.
కొన్నేళ్ళుగా ఒంట్లో బాగోలా. అయినా అస్త్ర సన్యాసం చేయలేదు. సాహిత్య సభలనీ, సంగీత కచేరీలనీ మాత్రం మానేవాడు కాదు. మాటల్లోగాని, చేతల్లోగాని,రాతల్లోగాని పరుషత్వం ఏ కోశానా ఉండేవి కావు. ఒక రకంగా సౌమ్యశీలి అనవచ్చు. స్నేహాలని ప్రాణప్రదం గా కాపాడుకొనేవాడు. ఆడంబరం దర్పం అతనిలో లేవు. కంచుకాగడా పెట్టి వెదికినా కనిపించవు.
రచయిత బుచ్చిబాబు ఎక్కడో రాశాడు- ‘‘మనదేశం ఇంత విశాలంగా ఉండడం చేటు. స్నేహితులు దూరదూర తీరాలకి తరలిపోతారు. పదేపదే కలవాలంటే కుదరదు. బెంగలు పెరిగిపోతుంటాయి. ఆర్ద్రత, అభి మానం, ప్రేమ ఎప్పటికీ ఉండేవే. అవి ఇగిరిపోవు, ఇంకిపోవు, పరిమళాలు వెదజల్లుతూనే వుంటాయి’’
ఏది ఏమైనా స్నేహం మీద ఇంద్రగంటి వారి సూక్తులు అజరామరం.
సృష్టిలో తీయనిది స్నేహమేనోయి
వ్యష్టిజీవము చేదుపానీయమోయి...
- చలసాని ప్రసాద్‌

నేను ఒప్పుకుంటాను చేరా గారు... - విమల

Andhra jyothi Published at: 28-07-2014 07:27 AM
ఎప్పుడు కలిసినా, ఎంతో ఆత్మీయంగా నవ్వుతూ పలకరించే చేకూరి రామారావు గారు ఇక లేరనుకోవడం మనసుకి చాలా కష్టంగా వుంది. విద్యార్థి ఉద్యమాలలో నేను పనిచేస్తున్న ఆ తొలినాళ్ళ నుంచీ ఆయన నాకు తెలుసు. ఆ రోజుల్లో, నేనూ, రంగవల్లీ ఉస్మానియా యూనివర్సిటీ నేరేడుచెట్ల మధ్య నుంచి క్యాంప్‌ త్రీ బస్తీ కలియ తిరిగి, తుప్పలూ, తుమ్మచెట్లూ దాటుకొని, అడ్డదారుల్లో చేరా ఇంటికి వెళ్ళేవాళ్ళం. రంగవల్లికి ఆ ఇల్లొక విడిది. చేరాగారు ఒక గొప్ప భాషా శాస్త్రవేత్త, సాహితీ విమర్శకుడు, రచయిత అన్న విషయాల కన్నా, ఆయన ప్రజా ఉద్యమాలకి సానుభూతిపరుడు అన్న ఒక్క సంగతే ఆరోజుల్లో మాకు ఎక్కువగా అర్థమైన విషయం. అప్పటి నుంచీ, విరసంలో ఓ కార్యకర్తగా పనిచేసిన కాలమంతా ఆయన్ని అనేక సార్లు కలిసేదాన్ని. నన్ను చూడగానే ఆయనకి అర్థమైపోయేది. కాసిన్ని కబుర్లుపోయాక ‘ఏం చేయాలిప్పుడు? ఏం కాగితాలు పట్టుకొచ్చావ్‌?’ అంటూ నవ్వేవారాయన. ఎదురుకాల్పుల హత్యను, అక్రమ అరెస్టులను, ప్రజా ఉద్యమాలపైన, విరసంపైనా పోలీసు దాడుల నుంచీ మొదలుకొని పాలస్తీనా ఇజ్రాయెల్‌ సమస్య, అమెరికా అగ్రరాజ్య దురహంకారం దాకా, అనేక ఖండనల ప్రకటనల పైన ఆయన తొలి సంతకం తీసుకుని, ఇతర మేధావుల దగ్గరికి వెళ్ళటం నా అలవాటుగా ఉండేది. ఆయన మారుమాట్లాడకుండా సంతకాలు పెట్టేవారు. ‘మీ విరసం వాళ్ళు సాహిత్యం కన్నా రాజకీయాల్ని మరీ ఎక్కువ పట్టించుకుంటున్నారు’ అంటూ అప్పుడప్పుడు నెమ్మదిగానైనా విసుక్కునే వారు.
ఏవైనా సభలు జరుగుతుంటే సానుభూతిపరులు, సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు పోగు చేసే మంచి సాంప్రదాయం ఒకటుండేది ఆ రోజుల్లో. అప్పుడు కూడా చేరాగారే నాకు మొదట గుర్తొచ్చేవారు. విరసంలో సభ్యురాల్ని అని ఆయనకు తెలుసుకానీ నేను రాస్తానన్న విషయం ఆయనకి తెలీదు చాలా కాలం. నేనూ చెప్పలేదు. ఎక్కడ చదివారో, ఎవరు చెప్పారో తెలీదు కానీ, నా కవితలు ఒకటి రెండు చదివి నాకోసం కాచుకు కూర్చున్నారాయన. షరా మామూలుగా ఏదో ప్రకటనపై సంతకాల కోసం వెళ్ళానాయన దగ్గరికి. ‘నువ్వు  కవిత్వం రాస్తావన్న విషయం నాకసలు తెలీనే తెలీదు. నువ్వసలు ఎన్నడూ చెప్పనే లేదు’ అంటూ నిష్టూరంగా, కోప్పడి ఇప్పటిదాకా రాసిన కవిత్వం అంతా పట్టుకొచ్చి తనకివ్వమని ఆర్డర్‌ వేసారాయన. నెలలు గడిచినా ఆ విషయం నేను పట్టించుకోలేదు. అప్పుడు నేను పనిచేస్తున్న పార్టీ ఆఫీసులోనే నేను వుండేదాన్ని. పోరాటాలు, పార్టీ పత్రిక బాధ్యతల మధ్య తీరికేలేని, రాసుకున్నవన్నీ జాగ్రత్తగా దాచుకోవాలన్న స్పృహ లేని కాలం అది. చివరికాయన నువ్వు నీ కవిత్వం వినిపిస్తేనే పిటీషన్ల మీద సంతకం పెడతాననే వారు. ఆయన అలా వెంటబడి అడగటాన్ని తట్టుకోలేక, రెండు వంద పేజీల నోటు పుస్తకాల్లో దొరికిన నా కవిత్వం రాసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. ఎవరినడిగారో, ఎలా కనుక్కున్నారో తెలీదు కానీ, ఓ రోజు సాయంత్రం చేరాగారే స్వయంగా తిలక్‌నగర్‌ బతకమ్మ కుంట వద్ద మేడపైన వున్న విమోచన ఆఫీసుకి వచ్చారు. ‘నీకేం పట్టదు. నువ్వు రావు కదా! నేనే నీకోసం వెతుక్కుంటూ వచ్చా’’నన్నా రాయన. నా కవిత్వం గురించి సాహితీ కారుల టెక్నికల్‌ పరిభాషలో ఆయన చాలా సేపు మాట్లాడారు కానీ, చివరికి విషయం ఏమిటంటే మోడెస్టీని కాస్సేపు పక్కన పెట్టి నా కవిత్వాన్ని సంకలనంగా వేయమని. ఆయన చాలా గట్టిగా చెప్పిన కారణంగానే విరసం ద్విదశాబ్ది సభల సందర్భంగా నా మొదటి కవిత్వ సంకలనం ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ వచ్చింది.
ఆయన నాకో మాట తరచూ చెప్పేవారు. ‘నువ్వు కేవలం రాజకీయ కార్యకర్తవి మాత్రమే కాదు. కవివి అన్న విషయం మర్చిపోకు’ అని. నిజానికి అట్లా మరిచిపోయే అనేక పనులు మాలాంటి వాళ్లందరికీ వుంటుండేవి. నేను కవిత్వం రాయడానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదనేది ఆయనకి నాపై వున్న కంప్లెయింట్‌. చేరాగారూ నేను కూడా వొప్పుకుంటాను మీ మాట.
ఆయన్ని కలవటానికి వెళ్ళినప్పుడు రాజకీయ పరిస్థితులు, విరసం కార్యక్రమాల మీదా, వస్తు శిల్పాల మీదా చాలా చర్చలే జరుగుతుండేవి. నిజానికి ఆయన్ని వట్టి శిల్పవాది అంటూ అధిక్షేపించేలా మాట్లాడటం పట్ల నాకు ఎప్పుడూ అభ్యంతరం వుండింది. మంచి కవిత్వాన్ని, కొత్త కవుల్నీ ఆయన కనుగొని, ప్రోత్సహించినట్లుగా మరెవరూ చేయలేదు. చేరాతల గురించి, ఆయన సమీక్షల గురించి సాహితీ లోకం అంతా ఎదురుచూసిన కాలం ఒకటుండేది. నీలి కవిత్వం, బూతురాతలు అంటూ స్ర్తీవాద కవిత్వాన్ని ఖండఖండలుగా తెగనరుకుతున్నప్పుడు ఆయన తన రెండు చేతులనీ అడ్డు పెట్టి ఆ కవిత్వాన్ని అక్కున చేర్చుకున్నారు. ఆ సమయంలో ఆయన చూపిన సంయమనం గొప్పది. అస్తిత్వవాదనల వేదననీ, ఆగ్రహాన్నీ ఆయన సరిగ్గానే గుర్తించగలిగారు. పాత కొత్తలలో వున్న మంచిని, ప్రగతిశీలతని చూడగలిగిన, ఎల్లవేళలా, బాధితుల పక్షానా, పోరాడేవారి పక్షాన నిలబడిన, వ్యక్తిగత కీర్తికాంక్షల జోలికి పోకుండా వినమ్రంగా, నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ పోయిన ఆ పాత తరం మెల్లిమెల్లిగా అదృశ్యం కావటం చాలా బాధిస్తోంది.
అప్పుడప్పుడూ ఏ మీటింగుల్లోనో కలిసినప్పుడు ‘ఇంటికి రావచ్చు కదా!’ అని చాలా సార్లు నన్నడిగి విసుగుపుట్టి ‘ఇకనిన్నడగను’ అన్నారు. ఆ మధ్య మళ్ళీ కలిసినప్పుడు ఇంటి గుర్తులు చెప్పి, రమ్మన్నప్పుడు తప్పక వస్తానన్నాను. కానీ నా మాట నేను నిలబెట్టుకోలేదు. ఆయన మళ్ళీ కలవలేని తీరాలకు వెళ్లిపోయారు. ఏం చేయను ‘విప్లవ కవయిత్రి విమలకు అభిమానంతో చేరా’ అంటూ మీరు మీ పుస్తకం మీద రాసిచ్చిన చేరాతని చూస్తూ...
- విమల


చేరా- ఒక ప్రతీక!
Namaste telangana, 7/28/2014 2:04:33 AM

చేరా గారు శరీర విరమణ చేశారే గానీ, వెళ్ళిపోలేదు. అక్షరాలా అక్షరాల్లో నిలిచే ఉన్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన స్థానాన్ని, గౌరవాన్ని నిలుపుకున్నారు. చేకూరి రామారావును మన చేరా అని అందరూ అనుకునేట్లుగా పేరును తెచ్చుకున్నారు. స్వచ్ఛమైన చిరునవ్వు, నిర్మలమైన మనస్సు ఆయన సొత్తు.

చేరా స్త్రీవాదం అనే మాటను వాడరు. స్త్రీ చైతన్యం అని వాడతారు. భాషా శాస్త్రవేత్తగా ఆయనకు పదాల పరిమితి, వాటి అర్థం స్ఫూర్తి తెలుసు కనుక వాదం అన్న పదం వల్ల దానికో పరిమితి ఏర్పడుతుందని భావించారనిపిస్తుంది. నిజానికి స్త్రీ చైతన్యం అనడం వల్ల ఇంతకుముందు చైతన్యం లేదు. ఇప్పటిది ఆ చైతన్యం అనేగాక, ఇప్పటిది మాత్రమే అనే పరిమితి వస్తుంది. అందుకే స్త్రీ వాదులెవరూ స్త్రీ చైతన్యం అని పిలవరు. స్త్రీవాద చైత న్యం అని వ్యవహరిస్తారు. ఇక్కడ వాదం అన్నది ఇజమ్‌నే గాక ఒక ఐడియాలజీని కూడా అది ప్రదర్శిస్తున్న ది.

స్త్రీ చైతన్యం పట్ల, స్త్రీలు చేస్తున్న రచనల పట్ల ఎంతో ఆసక్తిని చూపారు చేరా. ఆ ఆసక్తి వారి రచనల విశ్లేషణకు పురికొల్పింది. తద్వారా చేరా స్త్రీవాద సానుకూలత కలిగిన విలువైన విమర్శను అం దించి ఫెమినిస్టు విమర్శకు కావలసిన ఒక దారి ని చూపించారు. స్త్రీల రచనలను పరిశీలించేటప్పుడు చేరా వాదబలాన్ని కాకుండా స్త్రీల రచన ల్లో అనుభవ గాఢతను ఎక్కువగా చూశారు. జీవితానుభవమే చైతన్యంగా పరివర్తితమౌతుంది అన్న ఆలోచన చేరాలో ప్రస్ఫుటంగా ఉంది.

సాహిత్య పరిశోధనాంశాల పట్ల చేరా గారికి మక్కు వ ఎక్కువ. కొత్తకొత్త విషయాల్ని ప్రతిపాదించినా, సహేతుక చర్చలతో విశ్లేషణ చేసినా గుర్తించేవారు. గుర్తించడమే కాదు వారిని ప్రోత్సహించేట్లుగా మాట్లాడేవారు. అలా ఎందరెందరో విద్యార్థులు, సాహిత్యాభిరు చి కలవాళ్ళు ఆయన స్ఫూర్తితో మున్ముందుకు పోయారు. నా విషయమే తీసుకుంటే, నేను ఎంఫిల్ కోసం కవయిత్రుల కవిత్వంలో స్త్రీ మనోభావాలు అనే అంశాన్ని తీసుకొని పరిశోధన చేశాను.

అప్పుడప్పుడే ఎంఏ పూర్తి చేసుకొని విద్యార్థి దశలో ఉన్న యాకూబ్‌కీ, నాకూ పరిశోధన పట్ల ఆసక్తిని, అభిరుచిని పెరిగేట్లుగా ఎన్నో విలువైన సలహాలతో పాటు, విషయ సేకరణ విషయంలో ఎంతో సహాయం చేశారు. విద్యార్థులందరిపట్ల వాత్సల్య దృష్టిని కనబరిచేవారు. పుస్తకంగా తెచ్చినప్పుడు దానికి చేరా గారు ముందుమాట రాశారు. స్త్రీ చైతన్య దృష్టితో రాసిన రెండో గ్రంథంగా దీన్ని పరిగణించవచ్చు. రాగద్వేషరహితంగా, సత్యాన్వేషణ దృష్టితో చెయ్యటం ఈ పుస్తకంలో ప్రత్యేకత అని రాసిన చేరా గారి మాటలు నాకెంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చాయి.

మంచి పరిశోధనా గ్రంథంగా ఆయన భావించడం వల్ల పద్మావతి మహిళా యూనివర్సిటీ వారికి పీజీ వాళ్లకు రిఫరెన్స్ బుక్‌గా ఆయన సూచించారు. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరికో ప్రోత్సాహాన్నిచ్చిన సాహిత్యవేత్త ఆయన. నిరంతర పరిశోధకులు. చరిత్ర ఎప్పుడు పురుష దృష్టితోనే గుర్తింపబడుతోందని, స్త్రీలకు స్త్రీ రచయితలకు అపకారం జరుగుతుందని గుర్తించి, స్త్రీల తరఫున వకాల్తా పుచ్చుకున్న న్యాయవాది ఆయన. ఎక్కడెక్కడో మరగునపడిపోయిన, ఆణిముత్యాల్లాంటి అనేకమందిని గుర్తించి, తన వ్యాసాల్లో, భాషణల్లో, చేరాతల్లో ప్రస్తావించడమే ఒక పనిగా, బాధ్యతగా పెట్టుకున్నారు.
స్త్రీవాద ఉద్యమం ఎనభైలలో ప్రారంభమై ఉధృతిని పొంది, ఈనాడు సాహితీస్రవంతిలో ప్రధాన పాయగా ప్రవహిస్తున్న దశ వరకూ, చేరా అన్ని సందర్భాల్లోనూ చేయూతగా ఉన్నారు. అనేక విమర్శలకు గురైనప్పటికీ, స్త్రీల రచనలలోని ఔన్నత్యాలనూ, భాషా సౌందర్యాన్నీ, భావ గాఢతనీ, వారి సంఘర్షణాయుత జీవన నేపథ్యంలో చిక్కనైన రచనా ప్రౌఢత్వాన్ని గురించి చెబుతూనే వచ్చారు. సాహిత్య మహిళావరణంలో చేరాగారి విలువైన అభిప్రాయాలు, సూచనలు, ప్రోత్సాహాలు, సలహాలు, విమర్శలు, స్త్రీవాద చైతన్య అవసరాన్ని తెలియజేశాయి.

నీలిమేఘాలు ఆ శతాబ్దపు గొప్ప సంకలనమనీ, స్త్రీ చైతన్య విమర్శ రావాల్సి ఉందనీ, ఫెమినిస్టులకు మనవినీ, హెచ్చరికనూ చేశారు చేరా. కఠోర షడ్జమాలు వినిపించే కఠిన సత్యాల గురించీ, మనకు తెలియని మన చరిత్ర గురించీ, స్త్రీ అభివృద్ధి దిశలో సాహిత్య దశల గురించి, ఫ్యూడల్ వాసనల ఊబిలో ఉన్న మేధావుల గురించీ, స్త్రీని అక్రమ బంధాల భాషలో తప్ప మగవాడు ఇంకోరకంగా మాట్లాడలేడా? అంటూ ఇలా అనేకానేక ప్రశ్నలు వేస్తూ, వేసుకుంటూ, జవాబులు చెబుతూ ఆలోచించమంటూ చేరాగారు సాహిత్యజీవులతో, సామాన్య మానవులతో మౌఖిక ప్రచారాన్ని నిరంతరం చేస్తూ ఉండేవారు. స్త్రీ వాదం సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో కొండంత అండగా నిలిచారు. అది తన బాధ్యతగా భావించారు.
చేరాతల వల్ల చేరా వ్యక్తిత్వంలోని విస్తృత పార్శం ఆవిష్కృతమైంది. సాహిత్య విమర్శ పరిభాష విస్తృతమైంది. కొత్త పదబంధాలు విమర్శ రంగంలోకి అడుగుపెట్టాయి.

విమర్శలో ఒక కొత్త చూపును, ఒక వ్యవస్థను, ప్రమాణాలను, విలువలను నెలకొల్పారు. భావుకత్వంతో పరిఢవిల్లే భాషాభిమాని, భాషా నిర్మాణ విశ్లేషకుడు చేరా. చేరా గారితో మాట్లాడుతుంటే, మాటలు వింటుంటే, ఒక నడుస్తున్న లైబ్రరీని చూస్తున్నట్లే ఉంటుంది. వీసీగా ఉన్నప్పుడైనా, ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడైనా ఆయన స్వభావంలో కించిత్తు అహంభావం లేదు. పదవులు అశాశ్వతం అన్నట్లే ఉండేవారు. చేరాతల్లో అప్పుడప్పుడే రాస్తున్న ఎందరెందరికో ఆయన కవిత్వటానిక్‌ని ఇచ్చారు. కవులు ఎంతో సంతోషపడేవారు. చేరాగారు కూడా తన పసిపిల్లాడి మనస్తత్వం వల్ల అంతే సంతోషపడేవారు. ఒక తరం తరమంతటినీ తన విజ్ఞానంతో వెలిగించిన దివిటీ వంటి వారు.

రంగనాయకి గారు, వారమ్మాయి సంధ్య కూడా ఆత్మీయంగా ఉండేవారు. హేమంత్ కబుర్లు చెబ్తూ ఉండేవారు.వెళ్లగానే ఆయన ఆత్మీయంగా పిలిచే తీరు బాగా ఉండేది. భౌతికంగా మన మధ్య నుంచి వెళ్లిపోయినప్పటికీ, మన లోచనా ఆలోచనల సంద్రంలో ఎప్పటికీ నిలిచి ఉండే గొప్ప మనీషి ఆయన. గౌరవపూర్వకంగా, అశ్రునివాళిని తప్ప అంత గొప్ప మనిషికి ఏమివ్వగలం? కొందరంతే, తమ విశిష్ట వ్యక్తిత్వం వల్ల, అపారమైన మేధస్సు వల్ల, ఆత్మీయులెందరినో సమీకరించుకోవడం వల్ల ఎప్పటికీ, ఎప్పటికీ జీవించే ఉంటారు. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను అర్థం చేసుకుని, తెలుగు భాషాశాస్త్రం చట్రాల మధ్య తిరుగుతున్న ఆ రోజుల్లోనే తెలుగులో వెలుగును చూపేందుకు విశేష కృషి చేసిన అతి కొద్దిమందిలో చేరా ఒకరు. భాషాశాస్త్రం ఆధునికతను సంతరించుకోవడానికి విశిష్టమైన కృషి చేశారు. ఖమ్మం జిల్లాలో పుట్టి కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఎంఏ చేశారు.

తెలుగు వాక్య నిర్మాణంపై పీహెచ్‌డీ చేశారు. ఆధునిక భాషాశాస్త్ర రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన నోమ్‌ఛామ్‌స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని తెలుగుకు అన్వయిస్తూ విశ్లేషించారు. ఈ పరిశోధన సారాంశమే ఆయన వెలువరించిన తెలుగు వాక్యం పుస్తకం. తెలుగులో వెలుగులు, భాషాంతరంగం, భాషానువర్తనం వంటి విలువైన పుస్తకాల్ని రచించారు. పరిశోధనలే కాక, విమర్శ రంగంలో కూడా పెనుమార్పుల్ని తీసుకొని వచ్చారు. సామాన్య పాఠకులకు అందనంత ఎత్తులో ఉండేది విమర్శ కాదని చెప్పారు. అప్పటివరకు ప్రబలంగా వున్న ఆ ధోరణిని చెరిపేస్తూ, సాధారణ పాఠకులు సైతం విమర్శను చదివి, అర్థం చేసుకుని ఉత్తేజం పొందే స్థాయికి తీసుకువెళ్లారు.

సరళత, సృజనాత్మకతకు ఆయన ఇచ్చిన స్థానం వల్ల ఆయన సుప్రసిద్ధ విమర్శకుని స్థాయికి వెళ్లారు. సాంకేతిక శాస్త్ర దృక్పథమే కాకుండా అంతర్లీనంగా సాహిత్యదృష్టి కూడా కనపడడం చేరా రచనల ప్రత్యేకత. భాషారంగంలో బడు, యొక్క వంటి ప్రయోగాలను భాషాశాస్త్రవేత్తలు నిరసిస్తున్నా వాటి ఔచిత్యాన్ని కాదనలేమని, శాస్త్రబద్ధంగా వాదించి నిలబడిన వ్యక్తి చేరా.

చేరా ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఎంతోమంది కవుల సంకలనాలపై ఆయన రాసిన సాహిత్య విమర్శలు, ఎందరి రచనలకో ఆయన రాసిన ముందుమాటలు అటు రచయితకూ, ఇటు విమర్శకుడిగా ఆయనకూ ఖ్యాతిని తెచ్చిపెట్టడం విశేషం. చలం గారి భాషా ప్రయోగంపైనా, విశ్వనాథ వారి వచన రచనా వ్యూహాలపైనా చేరా గారు చాలా మౌలికమైన జ్ఞానాన్ని అందించారు. రచయిత ప్రాపంచిక దృక్పథం, సిద్ధాంతాలు, జీవిత తాత్వికత, సాహిత్య లక్షణం ఇవన్నీ అతని భాషను కూడా నిర్దేశిస్తాయని నిరూపించారు. వ్యాకరణాన్ని, ఆధునిక భాషాశాస్ర్తాన్ని అనేకకోణాల నుంచి అర్థం చేసుకొని సమన్వయపరిచి రాయడం చేరా రచనలోని గొప్పదనం. తెలుగు వాక్యంపై లోతుగా, సాధికారికంగా రచించిన భాషా శాస్త్రవేత్త మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు.
 
  No comments:

  Post a Comment